ప్రకృతి సవాళ్లను ఎదుర్కొందాం.. రైతాంగానికి మంత్రి పొంగులేటి పిలుపు

​కలం, ఖమ్మం బ్యూరో: ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదు అవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రైతాంగం సాంప్రదాయ సాగు మొండిపట్టు వీడి, మారుతున్న ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా అప్రమత్తం కావాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) పిలుపునిచ్చారు.

“వరి వద్దు.. మెట్ట పంటలే ముద్దు” అనే రీతిలో అధిక నీటి వినియోగం ఉండే పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ నీటితో చేతికొచ్చే ప్రత్యామ్నాయ మెట్ట పంటల వైపే దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఖమ్మం (Khammam) జిల్లా కూసుమంచి మండలంలో శనివారం మంత్రి పొంగులేటి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతేనని, ఇప్పటికే ‘రైతు భరోసా’తో అన్నదాతలకు అండగా నిలిచామని స్పష్టం చేశారు.

​ఈ పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి మల్లాయిగూడెం, కోక్యా తండా, అగ్రహారం గ్రామాల్లో రూ. 4.61 కోట్ల వ్యయంతో పలు సీసీ, బీటీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో 66 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, అలాగే వివిధ అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న 111 మంది బాధితులకు రూ. 35.16 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

​కాగా, పర్యటన ముగించుకుని వెళ్తున్న క్రమంలో లింగారం తండా, జుజ్జులరావ్ పేట శివార్లలో వరి నాట్లు వేస్తున్న మహిళా కూలీలను చూసి మంత్రి తన కాన్వాయ్‌ను ఆపారు. హోదాలు పక్కనబెట్టి నేరుగా పొలాల్లోకి వెళ్లి, ఆ పల్లె పడతుల కష్టసుఖాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి రాజకీయం లేని ‘ఇందిరమ్మ ఇళ్లు’ అందిస్తామని, ఉచిత కరెంట్, సంక్షేమ పథకాలు తోడుంటాయని మంత్రి ఇచ్చిన భరోసాతో పల్లె జనాలు హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>