కలం, దమ్మపేట : బతికున్న పట్టాదారుడిని కాగితాల్లో చంపేసి, నకిలీ పత్రాలతో ఐదు ఎకరాల భూమిని అక్రమంగా బదలాయించిన ఉదంతం దమ్మపేట మండలంలో వెలుగుచూసింది. ఈ భూ కుంభకోణం (Dammapeta Land Scam)లో అధికార దుర్వినియోగానికి పాల్పడి, నిబంధనలను బేఖాతరు చేసిన పెద్దగొల్లగూడెం జీపీఓ వి. అనంతమ్మ, తహసీల్దార్ రామ్ నరేశ్ పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. TGCS (CC&A) రూల్స్, 1991 లోని రూల్ 8(1) ప్రకారం ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దగొల్లగూడెం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 385/54 లో ఉన్న 5 ఎకరాల భూమిని కాజేసేందుకు పెద్ద స్కెచ్ వేశారు. అసలు పట్టాదారుడు బతికుండగానే, ఆయన చనిపోయినట్లు ఫోర్జరీ మరణ ధృవీకరణ పత్రాన్ని, నకిలీ కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లను సృష్టించారు. వీటికి తోడు ఎలాంటి సంబంధం లేని నామా పుష్పావతి అనే మహిళను చట్టబద్ధమైన వారసురాలిగా చూపిస్తూ, ధరణి సక్సెషన్ (వారసత్వ) మాడ్యూల్ ద్వారా చట్టవిరుద్ధంగా పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేసి అక్రమ బదలాయింపు పూర్తి చేశారు.
ఈ వ్యవహారంపై కొత్తగూడెం ఆర్డీఓ లోతుగా విచారణ జరిపారు. దమ్మపేట తహసీల్దార్ కె. రామ్ నరేశ్, జీపీఓ వి. అనంతమ్మలు ఇద్దరూ కుమ్మక్కై, క్షేత్రస్థాయి పరిశీలనను ఉద్దేశపూర్వకంగా తొక్కేసి, ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో నిరూపితమైందని కలెక్టర్‌కు నివేదించారు. దుష్ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కిందకు వస్తుండటంతో కలెక్టర్ కొరడా ఝులిపించారు.
క్రమశిక్షణా చర్యలు ముగిసే వరకు అనంతమ్మ దమ్మపేట ప్రధాన కేంద్రంగా సస్పెన్షన్‌లోనే కొనసాగుతారని, నిబంధనల ప్రకారం ఆమెకు సగం జీవనభృతి అందుతుందని స్పష్టం చేశారు. కాగా, ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న తహసీల్దార్ రామ్ నరేశ్ పై కూడా చర్యలు తీసుకున్నారు.

