కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం వేదికగా జరిగిన బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ యాత్ర’ బహిరంగ సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటిదాకా ఒకలెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ జంగ్ సైరన్ మోగించడానికి యంగ్ తరంగ్ సిద్ధమైందని ఆయన ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం యువత వల్లే ఉప్పెనలా మారిందని గుర్తు చేసిన ఆయన, నాడు కేసీఆర్‌కు ఓటేయవద్దన్న యువత ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాస్తేనే ఆ పార్టీకి సోయి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సరూర్‌నగర్ వేదికగా గతంలో జరిగిన మహా ద్రోహాన్ని, దగాను గుర్తు చేసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. దాదాపు 38 నెలల కిందట ఇదే వేదికపై కాంగ్రెస్ నేతలు నకిలీ ప్రేమను నటిస్తూ ‘యూత్ డిక్లరేషన్’ పేరిట వల పన్నారని విమర్శించారు. పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేటుగాళ్లు కలిసి నిరుద్యోగులను నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన 24 హామీల్లో ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు నాడు ఇచ్చిన హామీల వీడియోలను స్టేడియంలోని స్క్రీన్లపై ప్రదర్శించి యువతకు వివరించారు.
కాంగ్రెస్ పార్టీని ఒక ‘జిత్తులమారి ముసలినక్క’గా అభివర్ణించిన కేటీఆర్, ఆ పార్టీకి అధికార పీఠం దక్కితే నిరుద్యోగులకు మాత్రం బలిపీఠం మిగిలిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కాకుండా ‘లూటీఫికేషన్’ నడుస్తోందని, కొలువుల కుంభమేళా పేరుతో కుంభకోణాల కుంభమేళా సాగుతోందని ఆరోపించారు. హక్కుల కోసం ఉద్యోగాలు అడిగితే యువతను ఉరికిచ్చి కొడుతున్నారని, జాబుల క్యాలెండర్ వదిలేసి పాలకులు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మోసమని, కొలువులను కొల్లగొట్టి తెలంగాణ యువతను ఆగం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత మరోసారి పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

