కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural) నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి (MLA Bhoopathi Reddy) ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RWS, మిషన్ భగీరథ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తాగునీటి సరఫరా పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. వర్షాకాలంలో కూడా తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. మిషన్ భగీరథ పైప్లైన్లలో లీకేజీలు, సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మరమ్మతులు అవసరమైన ప్రాంతాలలో పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ ఈఈలు కే. రాకేష్, నరేష్ బాబు, డీఈఈలు నవీన్ రెడ్డి, కౌశిక్, వెంకటేశ్వర్ గౌడ్‌తో పాటు ఏడు మండలాల ఏఈఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

