కలం, ఖమ్మం బ్యూరో: భక్తి ముసుగులో వచ్చి అమాయక ప్రజలకు తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ నమ్మించి, ఏకంగా రూ. 85.70 లక్షల భారీ మొత్తాన్ని వసూలు చేసి బోర్డు తిప్పేసిన అంతర్రాష్ట్ర కిలాడీ ముఠా గుట్టును ఖమ్మం (Khammam) జిల్లా కామేపల్లి పోలీసులు శనివారం రట్టు చేశారు. సింగరేణి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. సాగర్ ఆధ్వర్యంలో చేపట్టిన ముమ్మర దర్యాప్తులో ఈ అంతర్రాష్ట్ర మోసగాళ్లు పట్టుబడ్డారు. నిందితుల నుండి ఒక మారుతి ఈకో కారు, రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లతో పాటు మోసాలకు ఉపయోగించిన నకిలీ ఆధార్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కర్ణాటకకు చెందిన నారాయణప్ప గురప్ప అలియాస్ ఆనంద రెడ్డి (63)కి గతంలోనే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, భూములు, బంగారం ఇప్పిస్తానని చెప్పి కోట్లాది రూపాయలు మోసం చేసిన నేరచరిత్ర ఉంది. గతంలో జైలు శిక్ష కూడా అనుభవించిన ఈ నిందితుడు, ఖమ్మం జిల్లాకు వచ్చి తన గుర్తింపును దాచిపెట్టాడు. ప్రజల్లో నమ్మకం సంపాదించడానికి “బోగా లక్ష్మీనారాయణ” అనే నకిలీ పేరుతో, అయ్యప్ప స్వామి మాల ధరించి, ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా స్థానికులకు పరిచయమయ్యాడు. కెప్టెన్ బంజారా గ్రామం కేంద్రంగా పూజలు, అన్నదానాలు, శబరిమల, ఏడుపాయల యాత్రలు వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి ముసుగులో ప్రజల నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్నాడు.
ప్రజల్లో భక్తితో కూడిన నమ్మకం ఏర్పడిన తర్వాత, తన డ్రైవర్, సహాయకుడైన కామేపల్లి మండలం బాసిత్‌నగర్ గ్రామానికి చెందిన బానోత్ సాయికుమార్ (20)తో కలిసి నిందితుడు అసలు రంగు బయటపెట్టాడు. 2026 ఫిబ్రవరి నెల నుండి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని నమ్మబలికారు. ప్రారంభంలో కొంతమందికి నమ్మకం కలిగించడం కోసం బంగారం, నగదును సకాలంలో తిరిగి ఇచ్చి, ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దీంతో కామేపల్లి మండల పరిసర ప్రాంతాలకు చెందిన 18 మంది బాధితులు వీరిని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు అప్పగించారు. అలా మొత్తం రూ. 85.7లక్షలు వసూలు చేసిన నిందితులు ఇద్దరూ ఒక్కసారిగా పరారయ్యారు.
బాధితుల సొమ్ముతో నిందితులు విలాసవంతమైన జీవనం గడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. వసూలు చేసిన డబ్బును గోవా పర్యటనలకు, తమ పాత అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగించడమే కాకుండా, గ్రామంలో తమపై అనుమానం రాకుండా ఉండేందుకు దైవ కార్యక్రమాలకు, స్థానిక దేవాలయ ఉత్సవాలకు, ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠకు భారీగా ఖర్చు చేశారు. అలాగే గ్రామస్తులకు అప్పుల రూపంలోనే సుమారు రూ. 10.50 లక్షలు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, ఈ నిందితులు ఒక మైనర్ బాలికను తమ వెంట తీసుకెళ్లిన ఘటనపై కల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల నిఘా తీవ్రం కావడంతో నిందితులు సదరు బాలికను తిరిగి కల్లూరులో దింపి, బాసీత్ నగర్ వైపు వస్తుండగా కామేపల్లి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా సింగరేణి సీఐ మాట్లాడుతూ.. ప్రజలు తక్కువ ధరలో బంగారం, భూములు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే నకిలీ బాబాలను, మోసగాళ్లను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించారు. సమాజంలో ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు నమ్మశక్యం కాని ఆఫర్లతో సంప్రదిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

