కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు విద్యార్థుల ఫీజు బకాయిల పేరుతో ఒరిజినల్ విద్యా సర్టిఫికెట్లను నిలిపివేయడాన్ని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (Telangana Inter Board) తీవ్రంగా పరిగణించింది. టీసీ, కండక్ట్, బోనాఫైడ్ లాంటి సర్టిఫికెట్లను విద్యార్థులు కోరిన వెంటనే అందజేయాలని అన్ని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు బోర్డు కార్యదర్శి కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఇంజినీరింగ్, డిగ్రీ, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ తదితర కోర్సుల ప్రవేశాల కోసం వెబ్ కౌన్సెలింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని కాలేజీలు సర్టిఫికెట్లు (Original Certificates) నిలిపివేస్తున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని బోర్డు ప్రస్తావించింది.
ఫీజు వివాదాలను చట్టబద్ధమైన పరిపాలనా విధానంలో తల్లిదండ్రులతో పరిష్కరించుకోవాలని, విద్యార్థుల విద్యా పురోగతికి ఎలాంటి ఆటంకం కలిగించవద్దని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరించే యాజమాన్యాలు, విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. కాలేజీ అనుబంధం రద్దు, మూసివేత లాంటి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అలాగే ప్రతి జిల్లాలో ఫిర్యాదులు స్వీకరించేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని చెప్పింది. నిబంధనల అమలును పర్యవేక్షించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ బోర్డు (Telangana Inter Board) నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
Read Also: ఇస్రోకు ఊహించని షాక్.. అసలు కారణం ఇదేనా?
Follow Us On : WhatsApp

