కలం, వెబ్ డెస్క్: ధరణి పోర్టల్ (Dharani Portal)లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలపై స్పెషల్ ఎంక్వైరీ టీం (సెట్) ఏర్పాటు చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ధరణి అమల్లోకి వచ్చిన 2020 అక్టోబర్ 29వ తేదీ నుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
10 వేల అనుమానాస్పద లావాదేవీలు..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో దాదాపు 10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలు బయటపడటం కలకలం రేపుతోంది. దీంతో, ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేయిస్తేనే లోపాలు బయటపడుతాయని భావిస్తోంది.
ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ పాత్ర, పోర్టల్ నిర్వహణ ఎలా ఉండేది, టెండర్ ఎలా జరిగింది, కాంట్రాక్ట్, టెక్నికల్ కమిటీ, సిస్టమ్ ఆర్కిటెక్చర్, డేటా భద్రత వంటి అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది.
భూ భారతి తెచ్చినా లోపాలు..
ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి తెచ్చినా.. అప్పటి సాఫ్ట్‌వేర్ కారణంగా ఇంకా లోపాలు వస్తూనే ఉన్నాయని కేబినెట్ అభిప్రాయపడింది. అనేక లోపాలు బయట పడుతూనే ఉన్నందున.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెట్ వేసినట్లు స్పష్టం చేసింది.

