టోల్ తీస్తున్నారు… సౌకర్యాలు ఎక్కడ?

కలం, నిర్మల్​ : జాతీయ రహదారులపై టోల్ ప్లాజా అంటే ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలు, ప్రమాణాలు గుర్తుకు వస్తాయి. కానీ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ గ్రామ శివారులోని ఎన్‌హెచ్–61పై ఉన్న టోల్ ప్లాజా (Dilawarpur Toll Plaza) మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ప్రతి రోజు వేలాది వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తున్నా, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

నిబంధనలు పక్కనపెట్టి ఏర్పాటు?

నిర్మల్ నుంచి మహారాష్ట్రలోని కళ్యాణ్ వరకు వెళ్లే జాతీయ రహదారి–61లో భాగంగా 2019లో ఈ టోల్ ప్లాజా (Dilawarpur Toll Plaza)ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి టోల్ ప్లాజా బైంసా మండలంలోని మాటేగాం వద్ద ఏర్పాటు కావాల్సి ఉంది. అక్కడ డివైడర్లు, టోల్ బూత్‌లు, సూచిక బోర్డుల నిర్మాణం కూడా చేపట్టారు. అయితే అనూహ్యంగా ఆ ప్రదేశాన్ని వదిలేసి దిలావర్‌పూర్ వద్ద హుటాహుటిన టోల్ ప్లాజాను ప్రారంభించారు. అప్పట్లో స్థానిక గ్రామాల ప్రజలు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది.

నాలుగు లేన్లు కాకుండానే టోల్ వసూళ్లు

జాతీయ రహదారులపై నాలుగు లేన్ల రహదారి పూర్తయిన తర్వాతే పూర్తిస్థాయి టోల్ వసూళ్లు చేపట్టాలన్న నిబంధనలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే దిలావర్‌పూర్ వద్ద ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో డబుల్ రోడ్ మాత్రమే ఉండగా, టోల్ వసూళ్లు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ టోల్ ప్లాజా గుండా ప్రతిరోజూ దాదాపు ఐదు వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ప్రతి ఏడాది కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నట్లు అంచనా. అయినప్పటికీ ఆ ఆదాయానికి తగినట్టుగా ప్రయాణికుల కోసం సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం విమర్శలకు కారణమవుతోంది.

టోల్ ప్లాజా వద్ద ఉండాల్సిన కనీస వసతులు కూడా కనిపించడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేదు. అత్యవసర వైద్య సహాయం అందించే కేంద్రం కనిపించదు. 100 మీటర్ల ముందే ఉండాల్సిన హెచ్చరిక, సూచిక బోర్డులు కూడా సరిగా లేవని విమర్శలు ఉన్నాయి. టోల్ ప్లాజా సమీపంలో సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో కొత్తగా వచ్చే వాహనదారులు చివరి క్షణంలో టోల్ ప్లాజాను గుర్తించి అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వస్తోందని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యమా?

ఈ మార్గంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు తరచూ ప్రయాణిస్తున్నప్పటికీ టోల్ ప్లాజాలోని లోపాలపై ఇప్పటివరకు సమగ్ర చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ టోల్ ప్లాజాలో వెంటనే ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, రహదారి ప్రమాణాలను మెరుగుపరచాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, భద్రతా చర్యలు చేపట్టాలని, టోల్ వసూళ్లు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా అనే అంశంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

వసూళ్లలో వేగం… వసతుల్లో శూన్యం!

ప్రతి ప్రయాణానికి టోల్ చెల్లించే వాహనదారులకు కనీస సౌకర్యాలు అందించడం సంబంధిత సంస్థల బాధ్యత. దిలావర్‌పూర్ టోల్ ప్లాజా విషయంలో మాత్రం “వసూళ్లలో వేగం… వసతుల్లో శూన్యం” అన్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరిస్తారా? లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>