కలం, వనపర్తి: డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ (Wanaparthy Collector) ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తకోట మున్సిపాలిటీ 3వ వార్డులో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణ చర్యలను సమీక్షించారు.
ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలకు దోమల నివారణపై అవగాహన కల్పించాలని, నీరు నిల్వ ఉండే పాత్రలను తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. జ్వరం లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని, పారిశుధ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. మున్సిపల్ అధికారులు డ్రైనేజీలను ప్రతిరోజూ శుభ్రపరచాలని, ఎక్కడా బ్లాకేజీలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
శిథిలావస్థలో ఉన్న భవనాల యజమానులతో మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, కొత్తకోట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సునీత పల్లవి, వైద్య, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

