కలం, వెబ్ డెస్క్: భారత క్రికెట్‌లో ఒక పెద్ద మార్పునకు అడుగులు పడుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన అక్షర్ పటేల్ (Axar Patel).. 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో అందరికంటే ముందు నిలిచాడు. ఇన్నాళ్లూ జట్టులో నంబర్ వన్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఉన్న సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) స్థానాన్ని అక్షర్ భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌పై అక్షర్ చూపించిన ఆల్రౌండ్ ప్రదర్శనతో సెలెక్టర్లు అతని వైపే మొగ్గు చూపుతున్నారు.
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బంతితోనూ, బ్యాట్‌తోనూ రెండింటిలోనూ అదరగొట్టాడు. బౌలింగ్‌లో 62 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కేవలం 52 బంతుల్లోనే అజేయంగా 57 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ విజయం భారత్‌కు సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందించడమే కాకుండా, సెలెక్టర్లలో అక్షర్‌పై నమ్మకాన్ని మరింత పెంచింది.
తదుపరి వన్డే ప్రపంచకప్‌కు బలమైన జట్టును సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్న సెలెక్టర్లకు అక్షర్ రూపంలో సరైన ఆటగాడు దొరికాడు. దీంతో రాబోయే రోజుల్లో వన్డేల్లో అతనే ప్రధాన ఆల్‌రౌండర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాను వన్డేల్లో మొదటి ప్రాధాన్యతగా చూడటం లేదని బోర్డు వర్గాలు చెప్తున్నాయి. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జడేజా బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపడం లేదు.
అలాగే బ్యాటింగ్‌లో కూడా మునుపటిలా వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయనే కారణంతోనే గత ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో జడేజాకు అవకాశం ఇచ్చారని సమాచారం. జడేజా భారత్ తరఫున 210 వన్డేల్లో 2,905 పరుగులు చేసి, 232 వికెట్లు తీసి గొప్ప రికార్డు సాధించాడు. అయితే, భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా సెలెక్టర్లు కొత్త తరం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ రేసులో దూసుకెళ్తున్నాడు.

