కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలో ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి కారణమైంది. పాత బస్టాండ్ సమీపంలోని రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ ఆర్టీసీ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని అజీజ్ గల్లీకి చెందిన ఓ మహిళ గురువారం స్కూటీపై బయటకు వెళ్లారు. ఈ క్రమంలో పాత బస్టాండ్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ చౌరస్తా వద్దకు చేరుకోగా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆమె స్కూటీని ఢీకొట్టింది.
ప్రమాద ధాటికి ఆమె కిందపడిపోగా, అదుపు తప్పిన బస్సు వెనుక చక్రం ఆమెపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే జరిగిన ఈ ఘటనను చూసిన స్థానికులు, వాహనదారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, చౌరస్తాలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను (CCTV Footage) పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సు వేగం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

