కలం, నిర్మల్: లోకేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao Patel) శుక్రవారం ప్రారంభించారు. రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత భవనాన్ని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు అవసరమైన ఎలక్ట్రికల్ సామగ్రితో పాటు ఇతర సహాయక పరికరాలను పంపిణీ చేశారు. తర్వాత కేజీబీవీ పాఠశాలలో రూ.45.12 లక్షల నాబార్డ్ నిధులతో ఏర్పాటు చేసిన అదనపు మౌలిక సదుపాయాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనంతరం గోడిసెర గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. లోకేశ్వరం మండల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన అర్లీ బ్రిడ్జి నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.

