దుబ్బాకలో కరువు ఛాయలు.. నీళ్లు లేక రైతుల ఆవేదన

క‌లం మెద‌క్ బ్యూరో: క‌ళ్ల ముందే నీళ్లున్నా.. త‌మ పంట పొలాలు త‌డ‌వ‌ని ప‌రిస్ధితి దుబ్బాక ప్రాంత ప్ర‌జ‌ల‌ది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం వేలాది ఎక‌రాల భూములిచ్చి త్యాగం చేసినా ఈ ప్రాంత‌ రైతులకు త‌మ‌ పంట‌ పొలాలకు చుక్క‌ నీళ్లురాని ద‌య‌నీయ పరిస్థితి నెల‌కొంది. నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్న మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టుల్లో నీరున్నా సాగుకు విడుదల చేయకపోవడంతో అన్నదాతలు (Dubbaka Farmers) తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతోపాటు, నీటికి విడుద‌ల చేయ‌క‌పొవ‌డంతో రైతాంగం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది. ప్రభుత్వాల చిన్న చూపు, అధికారుల అల‌స‌త్వం, వ‌ర్ష‌భావ ప‌రిస్ధితులు దుబ్బాక ప్రాంత‌ రైతుల‌కు శాపంగా మారుతుంది.

14 టీఎంసీలు ఉన్నా.. చుక్క కిందికి వ‌ద‌లట్లే..

సిద్ధిపేట జిల్లా దుబ్బాక ప్రాంతం. ఈ ప్రాంత సాగునీటి అవ‌స‌రాల కోసం గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం 50 టీఎంసీల సామ‌ర్ధ్యం క‌ల్గిన‌ మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు (Mallanna Sagar Reservoir) నిర్మాణం చేసింది. అంతేకాకుండా 15 టీఎంసీల సామ‌ర్ధ్యం క‌ల్గిన‌ కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ ప్రాజెక్టుకు కుడా దుబ్బాక‌కు చాల ద‌గ్గ‌ర ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వార దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని ప‌లు మండలాల‌కు సాగు నీరు అందించే విధంగా ప‌లు ప్ర‌ధాన కాలువ‌లు ఉన్నాయి. రామాయంపేట కాలువ, శంకరం పేట కాలువ, ఉప్పర్ పల్లి కాలువ, దుబ్బాక ప్రధాన కాలువల ద్వారా 10, 11, 12, 13 ప్యాకేజీల ద్వారా ల‌క్ష ఎక‌రాల‌కు వ‌ర‌కు సాగునీటిని అందించే అవ‌కాశం ఉన్న‌ది.

ఈ ప్రాజెక్ట్ లకు సంబంధించి ఇప్ప‌టికే ప్రధాన కాలువలు పూర్తి చేయడం జరిగింది. ప్రసుత్తం మ‌ల్లన్న సాగ‌ర్ ప్రాజెక్టులో 14.03 టీఎంసీలు, కొండ‌పోచ‌మ్మ ప్రాజెక్టులో 6.375 టీఎంసీల నీటి నిల్వ‌లు ఉన్నాయి. దీంతో మ‌ల్లన్న సాగ‌ర్ ప్రాజెక్టు, కొండ‌పోచ‌మ్మ ప్రాజెక్టుల‌లో నీళ్లున్నా.. కాలువ‌ల ద్వార నీటి విడుద‌ల చేయ‌క‌పొవ‌డంతో, త‌మ ప్రాంతంలో భారీ ప్రాజెక్టు ఉన్న‌ప్ప‌టికీ త‌మ భూముల సాగుకు ఈ నీరును వినియోగించుకోలేని పరిస్థితి రైతులకు నెలకొన్న‌ది.

తీవ్ర వ‌ర్ష‌భావ ప‌రిస్ధితులు..

సిద్దిపేట జిల్లాతోపాటు దుబ్బాక ప్రాంతంతో తీవ్ర వ‌ర్ష‌భావ ప‌రిస్ధితులు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే వ‌ర‌కు అందోళ‌న‌క‌ర స్ధాయిలో 40 శాతం మేర లోటు వ‌ర్ష‌పాతం న‌మోదైంది. వాన‌ల కోసం అకాశం వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన రైతులు.. కాస్తో కూస్తో అప్పుడ‌ప్పుడు కురిసిన జల్లులకే ఆశగా విత్తనాలు వేశారు. కానీ, ఆ తర్వాత ఎండల తీవ్రత పెరగడంతో వేసిన పత్తి, మొక్కజొన్న విత్తనాలు మొలకదశలోనే ఎండిపోయాయి. పలుచోట్ల అసలు విత్తనమే మొలకెత్తని పరిస్థితి నెలకొంది.

ఇక నీటి వసతి ఉన్న భూముల్లో, చెరువుల కింద వేసిన వరి నార్లు ఎండ తీవ్రతకు దెబ్బ‌తిన్నాయి. వేసిన విత్త‌నాలు మొల‌కెత్త‌క‌పొవ‌డం, ఒక‌వేళ‌ మొల‌కెత్తినా తేమ లేక ఎండిపోవ‌డంతో రైతుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతుంది. లోటు వ‌ర్షపాతంతో దుబ్బాక నియోజకవర్గంలోని మెజారిటీ చెరువులు, కుంటలు పూర్తిగా అడుగంటాయి. వ‌ర్షాలు లేక‌పొవ‌డంతో రైతులు పూర్తిగా బోరు బావులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే, భూగర్భ జలాల మట్టం తగ్గడం వల్ల బోర్లు కూడా సరిగ్గా పోయడం లేదు. వ‌ర్షాలు ప‌డుత‌య‌ని నమ్మి వేసినా పంటను కూడా కాపాడుకోలేక రైతులు తలలు పట్టుకుంటున్నారు. పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు.. వర్షాల్లేక నెర్రెలు చాచి కరువు ఛాయలను తలపిస్తున్నాయి.

 రైతన్నల ఆవేదన..

 మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టులో ప్ర‌సుత్తం 14 టీఎంసీల నీళ్లు ఉన్నప్ప‌టికీ, తమ పంటలు ఎండిపోతున్నా ఇప్పటి వ‌ర‌కు కాలువల ద్వారా వ్యవసాయానికి నీళ్లు వదలకపోవడంపై దుబ్బాక‌ రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మా భూములు గుంజుకుని ప్రాజెక్టు, కాలువ‌లు కట్టారు. కళ్లముందు నీళ్లు కనిపిస్తున్నా, మా పొలాలు ఎండిపోతుంటే కాలువల ద్వారా నీళ్లు ఎందుకు వదలట్లేదు” అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్రాజెక్టు నీళ్లుండి.. స‌ర‌ఫ‌రాకు కాల్వలున్నా చుక్క నీరు రావడం లేదని రైతుల ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర్షాలు ప‌డిన‌ప్ప‌డు ప్రాజెక్టుల అవ‌స‌రం ప‌డ‌ద‌ని, కానీ వాన‌ల లేని కాలంలో త‌మ పంట పొలాల‌కు ఎండి పోతున్నా కాలువ‌ల ద్వార నీళ్లు విడుద‌ల చేయ‌క‌పొవ‌డంతో తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

కాలువ‌ల ద్వారా చెరువులు, కుంట‌ల నింపితే.. చాలా వ‌ర‌కు రైతులు ప్ర‌యోజ‌నంగా ఉటుంద‌ని, చెరువులు నింపితే భూగ‌ర్భ‌జలాలు పెరిగి.. బోర్లు ద్వారా అయినా వ్య‌వ‌సాయం చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ ఖ‌రీఫ్ సీజ‌న్ సగం అయిపోవడానికి వచ్చిందని, కళ్లముందే మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా.. కాలువల్లో మాత్రం చుక్క నీరు లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది వ్యవసాయం చేయడం కష్టంగానే కనిపిస్తోందని చెబుతున్నారు.

త‌క్షణ‌మే నీటిని విడుద‌ల చేయాలి..

ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులు.. పంటలు చేతికి రాకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. తక్షణమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుండి కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని, కెనాల్స్ ద్వారా నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను కాల్వల ద్వారా నింపాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాలం ముగిసిన త‌ర్వాత అల‌స్యంగా కాలువ‌ల ద్వారా నీటి విడుద‌ల చేసినా లాభం ఉండ‌ద‌ని చెబుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ప్రాంతమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని త‌క్షణ‌మే నీటిని విడుద‌ల చేయాల‌ని దుబ్బాక ప్రాంత రైతులు కొరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>