కలం, దేవరకొండ: విద్యార్థులపై ప్రయోగిస్తున్న రెవెన్యూ రికవరీ యాక్టును తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ (Devarakonda) పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వివాదాస్పద జీవో నెంబర్ 9ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద విద్యార్థులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టారు.
సీట్లను వదులుకుంటున్న విద్యార్థులు..
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక, వచ్చిన సీట్లను వదులుకోవాల్సి వస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుపై ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతోందన్నారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి..
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తక్షణమే విద్యాశాఖపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. బకాయి ఫీజులను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు రెడ్డి కోటేశ్వరరావు, భీమగోని శివ గౌడ్, సొల్లేటి భాస్కరాచారి, పున్న భిక్షమయ్య, మునగాల గణేష్, కాటం వెంకటేష్ గౌడ్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

