కలం, నిర్మల్: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని కోరుతూ సారంగాపూర్ (Sarangapur) మండలం కౌట్ల (బి) గ్రామానికి చెందిన మహిళలు గురువారం అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ఆలయానికి (Adelli Pochamma Temple) భక్తిశ్రద్ధలతో పాదయాత్ర చేపట్టారు. గంగాజలాలతో నింపిన కలశాలను తలపై మోసుకుంటూ సుమారు ఐదు కిలో మీటర్ల మేర కాలినడకన అమ్మవారి సన్నిధికి చేరుకున్న మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేశారు.
వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండేలా కరుణించాలని అమ్మవారిని వేడుకున్నారు. “అడెల్లి పోచమ్మ తల్లి కరుణించమ్మా.. వర్షాలతో భూమిని పులకరింపజేయమ్మా.. రైతన్న కష్టాలు తీర్చమ్మా..” అంటూ భక్తులు ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా, ప్రత్యేక పూజలు, జలాభిషేకాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Read Also: నిర్మల్ కాంగ్రెస్‌లో రాజుకున్న అంతర్గత పోరు!
Follow Us On : WhatsApp

