కరీంనగర్ బ్యూరో: వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజుల పైగా గడుస్తున్నా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు పనులు ఇంకా ఊపందుకోలేదు. ఎల్నినో (El Nino) ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం, ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతాంగం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. “డ్రై స్పెల్” (ఎక్కువ రోజులు వర్ష విరామం) కారణంగా పొలాల్లో వేసిన విత్తనాలు మొలక దశలోనే ఎండిపోతుండగా నాట్లు పడక పొలాలు బీడులుగా మారుతున్నాయి. గతంలో అతివృష్టితో నష్టపోయిన సాగు రంగం ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కరవు కోరల్లో చిక్కుకునేలా కనిపిస్తోంది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో లోటు వర్షపాతం
వ్యవసాయ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగా నమోదైంది. కరీంనగర్ జిల్లాలో జూన్ 1 నుండి జూలై 9 వరకు సాధారణ వర్షపాతం 177.3 మి.మీ గానూ కేవలం 133.4 మి.మీ (25% లోటు).. జగిత్యాల జిల్లాలో 221.6 మి.మీ కి గానూ 163.8 మి.మీ మాత్రమే కురిసింది (26% లోటు). పెద్దపల్లి జిల్లాలో 225.4 మి.మీ సాధారణం కాగా 206.5 మి.మీ కురిసింది (8% లోటు). రాజన్న సిరిసిల్ల జిల్లాలో 179.3 మి.మీ కి గానూ 139.1 మి.మీ మాత్రమే నమోదైంది (22% లోటు). రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ లోని పలు మండలాలు, హుస్నాబాద్ వంటి మెట్ట ప్రాంతాలతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కరవు మండలాలుగా ప్రకటించినవి ఇప్పుడు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి.
అడుగంటుతున్న ప్రాజెక్టులు – పడిపోతున్న భూగర్భ జలాలు
వర్షాలు లేకపోవడంతో జీవనాడులైన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. రిజర్వాయర్ల ప్రస్తుత పరిస్థితి ఓ సారి చూస్తే .. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 15.27 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 20.175 టీఎంసీల సామర్థ్యానికి గాను 8.03 టీఎంసీలు ఉంది. మధ్య మానేరులో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 7.47 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. దిగువ మానేరు (LMD)లో 24 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 5.72 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎల్ఎండీ డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో కాలువల కింద ఆయకట్టుకు నీరందించే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు వర్షాభావం వల్ల భూగర్భ జలమట్టాలు సైతం వేగంగా పడిపోతున్నాయి. జూన్ 2025తో పోలిస్తే జూన్ 2026 నాటికి ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం సగటున 1 నుండి 2 మీటర్ల వరకు దిగజారింది. సిరిసిల్లలో అత్యధికంగా 12.04 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోవడంతో బోర్లు కూడా సన్నటి ధారలు పోస్తున్నాయి.
సాగు కుంటుపడింది
ఉమ్మడి జిల్లాలో 12,36,674 లక్షల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను కేవలం 2,11,844 లక్షల విస్తీర్ణంలో సాగయ్యింది. ఆయా జిల్లాల్లో బోర్లలో నీరున్న రైతులు వరినాట్లు వేస్తుండగా చెరువు పారుకం, బావులపై ఆధారపడిన వారు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. లక్షలాది ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను ఇప్పటివరకు 20 శాతం కూడా సాగు కాలేదు. కరీంనగర్లో 2.39 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి కేవలం 49 వేల ఎకరాలు, జగిత్యాలలో 3.31 లక్షల ఎకరాలకు 65 వేల ఎకరాలు, పెద్దపల్లిలో 3.85 లక్షల ఎకరాలకు 56 వేల ఎకరాలు మాత్రమే సాగైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.79 లక్షల ఎకరాలకు గాను 39,669 ఎకరాలు మాత్రమే సాగయ్యింది.
మొలక దశలోనే పత్తి ఎండిపోతోంది
ఉమ్మడి జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతోంది. తొలి వానలకే రైతులు ఉత్సాహంగా పత్తి గింజలు విత్తారు. కానీ ఆ తర్వాత నెల రోజుల పాటు ఆశించిన వర్షాలు లేకపోవడంతో మొలకెత్తిన పత్తి మొక్కలు చేనులోనే ఎండిపోతున్నాయి. చాలా చోట్ల రైతులు విత్తనాలు మొలవక, ఎకరాకు రూ. 5 వేల నుండి 8 వేల వరకు నష్టపోయి మళ్లీ దుక్కులు దున్నుతున్నారు. మరోవైపు నీళ్లు లేక వరి నార్లు పోసే పనులే ఇంకా పూర్తి కాలేదు. పోసిన కొద్దిపాటి నార్లు కూడా ఎండిపోతుండటంతో కాపాడుకోవడానికి రైతులు ట్యాంకర్లతో, బిందెలు, బకెట్లతో నీళ్లు పోయాల్సిన దుస్థితి ఏర్పడింది. వాగుల్లో, ప్రాజెక్టుల నుంచి ఇసుక తవ్వి నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు.
ముంచుకొస్తున్న విత్తన గడువు
వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం పత్తి, కంది, మినుము, పెసర వంటి పంటలను జూలై 15 లోపు విత్తుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది. ఆ తర్వాత విత్తితే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. వరి పంటకు సంబంధించి దీర్ఘకాలిక రకాలను జూన్ 20 లోపు, మధ్యకాలిక రకాలను జూలై 10 లోపు నార్లు పోయాల్సి ఉండగా.. ఆ గడువు ముగిసిపోయింది. ప్రస్తుతం జూలై 31 వరకు స్వల్పకాలిక రకాలను మాత్రమే నార్లు పోసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పత్తి, వరికి బదులుగా రాబోయే రోజుల్లో వర్షాలు పడితే ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటను ఎంచుకోవాలని, అలాగే మొక్కజొన్నను కందితో కలిపి అంతర పంటగా వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని సలహా ఇస్తున్నారు.
దిక్కుతోచని స్థితిలో అన్నదాత
ఒకవైపు పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలతో పెట్టుబడి భారం మోస్తూ.. మరోవైపు ప్రకృతి సహకరించక అన్నదాతలు సతమతమవుతున్నారు. ఆకాశం వైపు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న రైతాంగానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని, కరవు ముప్పు నుండి కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఈ దశలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించేందుకు వ్యవసాయశాఖ ద్వారా చర్యలు చేపట్టింది. నేటి నుంచి వారం రోజుల పాటు రైతు చైతన్య సదస్సులను కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారు. వరికి బదులుగా తక్కువ నీటి తడులు అవసరమయ్యే ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను చైతన్య పరిచేందుకు సిద్దమవుతున్నారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ , పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటలు సాగు చేసేందుకు ప్రచారం కల్పిస్తున్నారు. అయితే దుక్కి దున్ని విత్తనాలు, ఎరువులు, నార్లు పోసుకుని పెట్టుబడులన్నీ ఆవిరయ్యాక అధికారులు చేపట్టే చర్యలు ఫలిస్తావో లేవో వేచి చూడాలి.

