కలం, స్పోర్ట్స్: టెన్నిస్ కోర్టులో అద్భుతాలు సృష్టించిన స్విస్ దిగ్గజం స్టాన్ వావ్రింకా (Stan Wawrinka) వీడ్కోలు ప్రస్థానంలో ఒక భావోద్వేగ అధ్యాయం ముగిసింది. ఎక్కడైతే ఆయన కెరీర్ ప్రయాణం మొదలైందో, సరిగ్గా అదే వేదికపై తన చివరి మ్యాచ్ ఆడి క్రీడాభిమానులకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ 41 ఏళ్ల మూడు సార్ల గ్రాండ్ స్లామ్ విజేత ఈ 2026 సీజన్ ముగింపులో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో, తన సుదీర్ఘ ప్రస్థానం ప్రారంభమైన స్విస్ ఓపెన్ జిస్టాడ్ టోర్నీలో చివరిసారిగా బరిలోకి దిగారు.
రెండు దశాబ్దాల క్రితం, అంటే 2003లో ఇదే వేదికపై తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వావ్రింకా.. ఆ తర్వాత రెండేళ్లకు ఇక్కడే తొలిసారిగా ఫైనల్‌కు చేరి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. మంగళవారం రాత్రి రాయ్ ఎమర్సన్ ఎరీనాలో పోర్చుగల్‌కు చెందిన జైమ్ ఫారియాతో జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా వీరోచితంగా పోరాడారు. దాదాపు రెండు గంటల 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను టైబ్రేకర్ ద్వారా 7-6(8)తో గెలుచుకున్నప్పటికీ, తర్వాతి సెట్లలో తీవ్రంగా శ్రమించి 6-4, 6-4 తేడాతో ఓటమిపాలయ్యారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వాహకులు వావ్రింకా గౌరవార్థం ఒక ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ముద్దుపేరు ‘స్టాన్ ది మ్యాన్’ను ప్రతిబింబిస్తూ ‘ది మ్యాన్’ అని రాసి ఉన్న ఒక జత స్కీయింగ్ స్నో బోర్డులను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా వావ్రింకా భావోద్వేగానికి లోనవుతూ, తన సుదీర్ఘ కెరీర్‌లో అండగా నిలిచిన అభిమానులకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
స్టేడియంలోని పెద్ద స్క్రీన్‌లపై స్టెఫానోస్ సిట్సిపాస్, కాస్పర్ రూడ్ వంటి ప్రముఖ క్రీడాకారులు పంపిన వీడియా సందేశాలను ప్రదర్శించారు. వావ్రింకా సాధించిన గ్రాండ్ స్లామ్ విజయాలు తమకెంతో స్ఫూర్తినిచ్చాయని రూడ్ కొనియాడారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ వంటి 3 మేజర్ ట్రోఫీలతో పాటు మొత్తం 16 అంతర్జాతీయ టైటిళ్లను వావ్రింకా సాధించారు. స్విస్ పురుషుల టెన్నిస్ చరిత్రలో రోజర్ ఫెదరర్ తర్వాత అత్యంత విజయవంతమైన ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు.

