కలం, స్పోర్ట్స్ : ఫిఫా 2026 వరల్డ్ కప్ (FIFA World Cup)లో ఛాంపియన్ షిప్‌కు ముందు గోల్డెన్ బూట్ పోటీ రసవత్తరంగా మారింది. ఇందులో ముందంజలో మెస్సీ (Lionel Messi) ఉన్నా.. అతడికి ఎంబప్పే (Kylian Mbappe) గట్టి పోటీ ఇస్తున్నాడు. ఎంబప్పే దూకుడు చూస్తే మెస్సీని అధిగమించి గోల్డెన్ బూట్ అందుకుంటాడన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకపక్క స్పెయిన్ చేతిలో ఓడిపోయి ఫ్రాన్స్ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, ఎంబప్పే వ్యక్తిగత రికార్డుల పరంగా మాత్రం మెస్సీకి ఇంకా సవాల్ విసురుతూనే ఉన్నాడు.
ప్రస్తుతం కిలియన్ ఎంబప్పే, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఇద్దరూ తలా 8 గోల్స్ చేసి ఈ టోర్నీలో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అయితే, ఫిఫా నిబంధనల ప్రకారం ఇద్దరు ఆటగాళ్లు సమానంగా గోల్స్ చేసినప్పుడు ఎవరు ఎక్కువ అసిస్ట్‌లు (గోల్ చేయడానికి సహకరించడం) అందించారనే దాన్ని బట్టి విజేతను నిర్ణయిస్తారు. ఈ విభాగంలో ఎంబప్పే 3 అసిస్ట్‌లతో ముందంజలో ఉండగా, మెస్సీ 2 అసిస్ట్‌లతో రెండో స్థానంలో ఉన్నారు. ఒకవేళ ఇద్దరూ ఎనిమిది గోల్స్ వద్దే ఆగిపోతే, టైబ్రేకర్ నియమం ప్రకారం ఎంబప్పేకే గోల్డెన్ బూట్ దక్కుతుంది.
ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడానికి ఇద్దరికీ ఇంకా తలా ఒక మ్యాచ్ ఆడే అవకాశం మిగిలి ఉంది. శనివారం జరగబోయే మూడో స్థానం మ్యాచ్‌లో ఫ్రాన్స్ తరఫున ఎంబప్పే బరిలోకి దిగనుండగా, బుధవారం జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో మెస్సీ తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లలో వీరు సాధించే స్కోర్ల ఆధారంగానే విజేత ఎవరో తేలనుంది.
ట్రోఫీ రేసు నుంచి నిష్క్రమించినా వ్యక్తిగత మైలురాయి కోసం ఎంబప్పే ప్రయత్నిస్తుండటం, మరోపక్క మెస్సీ తన అసాధారణ ఫామ్‌తో దూసుకుపోతుండటం క్రీడాభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. సెలక్టర్లు, విశ్లేషకులు కూడా ఈ ఇద్దరిలో గోల్డెన్ బూట్ ఎవరిని వరిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

