కలం, స్పోర్ట్స్: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా (Argentina), ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌కు ముందే పెద్ద వివాదం రాజుకుంది. మ్యాచ్ రెఫరీలు లియోనెల్ మెస్సీ బృందానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనాను టోర్నమెంట్ నుంచి వెంటనే బహిష్కరించాలంటూ ఆన్‌లైన్‌లో ఏకంగా ఒక పిటిషన్ మొదలైంది. ఈ వివాదం వెనుక ఒక సుదీర్ఘమైన కథ నడుస్తోంది.
గతంలో జరిగిన మ్యాచ్‌లలో రెఫరీలు అర్జెంటీనాకు బాగా వత్తాసు పలికారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ‘అర్జెంటీనాఅవుట్ డాట్ కామ్’ అనే ప్రచార వేదిక ద్వారా ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించారు. ఫిఫా, రెఫరీలు పూర్తిగా మెస్సీకి, అర్జెంటీనాకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. విజేత ఎవరో ముందే రాసిపెట్టుకున్నప్పుడు మిగిలిన దేశాలు ఎందుకు ఆడాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అర్జెంటీనాను బయటకు పంపి మిగిలిన జట్లకు సమాన అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి ఈ పిటిషన్‌పై ఏకంగా కోటి మందికి పైగా సంతకాలు చేయడం గమనార్హం. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇంగ్లాండ్, అర్జెంటీనాలు మరోసారి మైదానంలో తలపడబోతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ అంటేనే ఎప్పుడూ ఒక యుద్ధంలా ఉంటుంది.
దీనికి క్రీడలతో పాటు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫాక్‌లాండ్ దీవుల (మాల్పినాస్) సార్వభౌమాధికార వివాదం కూడా ఒక రాజకీయ నేపథ్యంగా ఉంది. అంతేకాకుండా, 1986 మెక్సికో ప్రపంచ కప్‌లో డియాగో మారడోనా చేతితో కొట్టిన వివాదాస్పద ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ద్వారా అర్జెంటీనా 2-1తో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆ చారిత్రాత్మక మ్యాచ్ జరిగి సరిగ్గా 40 ఏళ్లు పూర్తయిన తరుణంలోనే ఈ రెండు జట్లు మళ్లీ తలపడుతుండటం విశేషం.
ఈ మ్యాచ్‌లో గోల్డెన్ బూట్ రేసు కోసం మెస్సీ, ఎంబప్పేలతో పోటీ పడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ స్పందించారు. ఈ మ్యాచ్ చుట్టూ ఉన్న భావోద్వేగాల వల్ల తమ జట్టు దృష్టి మరలబోదని ఆయన స్పష్టం చేశారు. మైదానంలో ప్రత్యర్థి చాలా తెలివైన, వ్యూహాత్మకమైన జట్టు అని ఆయన పేర్కొన్నారు. ఫౌల్స్ ఎలా రాబట్టాలో, ఆట వేగాన్ని ఎలా తగ్గించాలో వారికి బాగా తెలుసని చెబుతూ.. తాము కేవలం మైదానంలో ఆటపైనే దృష్టి పెడతామని ఐటీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

