రేణుక వ్యాఖ్యలు.. పువ్వాడకు పొలిటికల్ బూస్ట్?

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాజకీయాల చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా మరోసారి రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఏ పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించాలన్నా ఖమ్మం జిల్లాలో పట్టు సాధించడం కీలకమని గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక మంత్రులు జిల్లాలో ప్రభావం చూపుతున్న సమయంలో..  చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి.

రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి (Renuka Chowdhury) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఖమ్మం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్‌కు ఇప్పటికీ గ్రామస్థాయిలో బలమైన క్యాడర్ ఉందని, నేతలు మారినంత మాత్రాన ఆ పార్టీ పునాదులు బలహీనపడవని ఆమె చేసిన విశ్లేషణ కాంగ్రెస్ శ్రేణులకు హెచ్చరికగా మారింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నేతలు గతంలో బీఆర్ఎస్ రాజకీయాలలో  కీలక పాత్ర పోషించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay) ఇప్పుడు మళ్లీ రాజకీయంగా చురుకుగా మారారు. ఖమ్మం నియోజకవర్గంలో తన ఉనికిని బలపరిచేందుకు ఆయన వరుస పర్యటనలు చేపడుతున్నారు.  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బాధ్యతలను పువ్వాడ కీలకంగా తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రంగంలోకి దిగిన పువ్వాడ అజయ్ కుమార్  ముఖ్యంగా తనను ఓడించి మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

“తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఖమ్మం అభివృద్ధికి కృషి చేశానని.. ఇప్పుడు జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజలకు కనిపిస్తున్న మార్పు ఏమిటని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న కొంతమంది కీలక నేతలకు గతంలో బీఆర్ఎస్‌తో అనుబంధం ఉండటం పువ్వాడకు రాజకీయంగా కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను అంచనా వేసుకుంటూ ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీపై రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు కూడా ఖమ్మం జిల్లాకు సరిగ్గా అద్దం పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ కొన్ని స్థానాలు గెలిచినప్పటికీ, ఖమ్మం లాంటి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన నాయకత్వం కానీ, గ్రామ గ్రామాన విస్తరించిన క్యాడర్ కానీ లేవని, కేవలం సోషల్ మీడియా హడావుడితోనే రాజకీయం నడుపుతోందని ఆమె తేల్చి చెప్పారు. ఇది ఖమ్మం జిల్లాలో బీజేపీ ఉనికిని మరింత ప్రశ్నార్థకం చేస్తోంది. ​ మొత్తంగా రేణుకా చౌదరి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు అప్రమత్తత సంకేతంగా మారగా.. బీఆర్ఎస్‌కు మాత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>