కలం, మెదక్ బ్యూరో : గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ (Gajwel Congress)లో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మండల కమిటీలు పంచాయితీ కాస్తా.. ఇప్పుడు ఇద్దరు సీనియర్ నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మైనంపల్లి హన్మంతరావుకు మధ్య విభేదాలు గాంధీ భవన్ గడపకు చేరాయి.
ఇరు వర్గాల పోటాపోటీ ఫిర్యాదులతో ఇరు వర్గాలు గాంధీ భవన్ బాట పట్టడంతో గజ్వేల్ కాంగ్రెస్ లొల్లి చర్చనీయాంశంగా మారింది. పీసీసీ నియామకాలను ధిక్కరించి, నర్సారెడ్డి సొంతంగా మండల కమిటీలు ప్రకటించాడని , ఆయన వ్యవహార శైలి వల్ల గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని మైనంపల్లి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మైనంపల్లి హన్మంతరావు అనుచరులు, స్థానిక కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌కు చేరుకుని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి నర్సారెడ్డిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
నర్సారెడ్డి అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడల కారణంగానే గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ కేడర్ నిర్వీర్యమవుతోందని వాపోయారు. పార్టీకి నష్టం కలిగిస్తున్న నర్సారెడ్డిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు నియోజక వర్గ ఇంచార్జిగా ఉన్న తనకు చెప్పకుండా నియామకాలు చేయడం పట్ల మైనంపల్లిపై పీసీసీకి నర్సారెడ్డి ఫిర్యాదు చేశాడు .
తన ఇలాకాలో మైనంపల్లి హన్మంతరావు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ నియోజకవర్గ ఇంచార్జ్ తూంకుంట నర్సారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తనతో సంప్రదించకుండా తూప్రాన్, మనోహరాబాద్ మండల కమిటీల అధ్యక్ష పదవులను పీసీసీ ఏకపక్షంగా ఎలా నియమిస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. గజ్వేల్ కాంగ్రెస్ వ్యవహారాల్లో అసలు సంబంధం లేని మైనంపల్లి హన్మంతరావు జోక్యం చేసుకుంటూ, తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాడని నర్సారెడ్డి వర్గం ఆరోపిస్తోంది.

