‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’.. అశ్వాపురం రైతుల నీటి కష్టాలు

​కలం, ఖమ్మం బ్యూరో: “అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని” చందంగా తయారైంది భద్రాద్రి కొత్తగూడెం (Bhadadri Kothagudem) జిల్లా అశ్వాపురం మండల రైతుల (Ashwapuram Farmers) పరిస్థితి. మండల పరిధి నుంచే సీతారామ ప్రాజెక్టు నీళ్లు తరలిపోతున్నా, స్థానిక చెరువులను నింపకుండా మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకు నీటిని తరలించుకుపోవడం ఎంతవరకు సమంజసమని అఖిల పక్ష నాయకులు నిలదీశారు.

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక, కళ్లముందే వరి నారుమళ్లు ఎండిపోతున్నా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తుమ్మలచెరువు ఆయకట్టును ఆదుకోవాలంటూ రైతుల పక్షాన సమర శంఖం పూరించారు. మొండికుంట గ్రామంలో బుధవారం సమావేశమైన అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు, క్షేత్రస్థాయిలో ఎండిపోతున్న నారుమళ్లను స్వయంగా పరిశీలించారు.

మారెళ్ళపాడు నుంచి తుమ్మలచెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లిచ్చి వర్షాకాలం పంట వచ్చేసరికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని గతంలో మంత్రులు, అధికార పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే నేటికీ లిఫ్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయని ధ్వజమెత్తారు. తుమ్మలచెరువుకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇరిగేషన్ డీఈకి వినతిపత్రం ఇచ్చారు.

అంతే కాకుండా ​ఈ నిర్లక్ష్యానికి నిరసనగా గురువారం ఉదయం అఖిలపక్షం ఆధ్వర్యంలో మారెళ్ళపాడు ప్రాజెక్టు నుంచి బీజీ కొత్తూరు వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ వరకు క్షేత్రస్థాయి సందర్శన చేపట్టనున్నట్లు ప్రకటించారు. తుమ్మలచెరువు కింద ఉన్న ఆయకట్టు రైతులందరూ తమ హక్కుల సాధన కోసం ఈ పంప్ హౌస్ సందర్శన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు స్వర్గం బాల నర్సయ్య, బద్దం శంబిరెడ్డి, బీఆర్ఎస్, టీజేఎస్, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>