కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన నిబద్ధతను చాటుకుంటూ మరోమారు ఆదర్శంగా నిలిచారు. ఇటీవల ఆయన భుజానికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించిన ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ఆశించకుండా, తన సొంతంగా వెచ్చిస్తున్నారు. కేవలం ఆపరేషన్ ఖర్చులే కాకుండా, ఈ చికిత్స నిమిత్తం ఆయన చేసిన ప్రయాణ ఖర్చులను సైతం స్వయంగా భరిస్తున్నారు.
గతంలో ఆయనకు ముక్కుకు శస్త్రచికిత్స జరిగిన సమయంలోనూ ఇదే విధంగా సొంత డబ్బులనే వినియోగించారు. సాధారణంగా రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా, దానికి అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వం నుంచి పొందే చట్టబద్ధమైన అవకాశం ఉంది. అయినప్పటికీ, ప్రజల సొమ్మును తన వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించకూడదనే స్వీయ నిబంధనను పవన్ కళ్యాణ్ పాటిస్తుండటం విశేషం. ప్రజాధనం పట్ల ఆయన చూపిస్తున్న ఈ బాధ్యతాయుతమైన వైఖరిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

