కలం, వెబ్ డెస్క్ : అదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ (Adilabad CCI Factory) పునరుద్ధరణ కోసం భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలోని బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కేటీఆర్ బృందం కలవనుంది. చాలా కాలంగా మూతపడి ఉన్న అదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌తో కేంద్ర మంత్రికి వారు ఒక వినతిపత్రాన్ని సమర్పించనున్నారు.
ఈ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో కేటీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, అలాగే సీసీఐ సాధన సమితి ముఖ్య నాయకులు ఉన్నారు. కేంద్ర మంత్రితో భేటీ ముగిసిన అనంతరం, ఈ అంశంపై సాధించిన పురోగతిని వివరిస్తూ ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. అదిలాబాద్ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఈ పర్యటన అత్యంత కీలకమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

