కలం, వెబ్ డెస్క్ : కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) భౌతికకాయం ఆయన స్వగ్రామానికి చేరుకుంది. హైదరాబాద్‌లో కన్నుమూసిన ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు అభిమానులు, కాపు సామాజికవర్గ నేతలు, రాజకీయ ప్రముఖులు కిర్లంపూడి నివాసానికి భారీగా తరలివస్తున్నారు.
స్వగృహానికి చేరుకున్న ముద్రగడ భౌతికకాయాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దశాబ్దాల పాటు ప్రజల కోసం, ప్రత్యేకించి కాపు రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఒక గొప్ప నాయకుడు ఇక లేరనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు సాయంత్రానికే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కూతురు క్రాంతిని అడ్డుకున్న పోలీసులు..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, ఇదే సమయంలో ఆయన కుమార్తె క్రాంతికి మాత్రం అక్కడ చేదు అనుభవం ఎదురైంది. తండ్రిని చివరి చూపు కోసం వస్తున్న ఆమెకు ముద్రగడ అనుచరుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. క్రాంతిని లోపలికి రానిచ్చేది లేదంటూ అనుచరులు తెగేసి చెప్పారు.
అంతకుముందు ముద్రగడ కుటుంబసభ్యుల నుంచి వచ్చిన ముందస్తు సమాచారం, సూచనల మేరకు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ప్రత్తిపాడు సమీపంలోనే క్రాంతి ప్రయాణిస్తున్న కారును పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆమెను ముద్రగడ నివాసానికి వెళ్లకుండా పోలీసులు అక్కడే నిలిపివేశారు. దీంతో కిర్లంపూడి ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

