పీవోకేలో దారుణ పరిస్థితులపై భారత్ ఆందోళన

కలం, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీరులో దారుణ పరిస్థితులు నెలకొన్నట్లు భారత్ (India) పేర్కొంది. మహిళలు, చిన్న పిల్లలపై పాక్ సైన్యం సాగిస్తున్న అరాచకాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘కొన్ని దశాబ్దాలుగా దాయాది దేశం ఉద్దేశపూర్వకంగా పీవోకే ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ వస్తోంది. అక్కడి పరిపాలన ఇతరత్ర వ్యవహారాల్లో అక్రమంగా జోక్యం చేసుకుంటోంది. సమస్యలపై ఫిర్యాదు చేస్తే పరిష్కరించాల్సింది పోయి.. పోలీసులు ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. పాకిస్థాన్ వైఖరిపై అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి కట్టడి చేయాలి’ అని డిమాండ్ చేసింది.

కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో అనేక కీలక అంశాలపై భారత్ వైఖరిని తెలియజేశారు.

హోర్ముజ్ జలసంధిపై నిరంతర పర్యవేక్షణ..

హోర్ముజ్ జలసంధిలో భారతీయులున్న నౌకపై ఇరాన్ సైన్యం దాడిలో ఒకరు చనిపోవడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని రణధీర్ జైశ్వాల్ అన్నారు. అక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే ఇరాన్ డిప్యూటీ చీఫ్​ మిషన్‌కు సమన్లు జారీ చేసినట్లు తెలిపారు.

ఆర్థిక, ఇంధన భద్రతకు ఈ జలసంధి అత్యంత కీలకంగా మారిందని.. భారత నౌకలు సురక్షితంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వివరించారు. ఇరాన్, అమెరికా వెంటనే ఉద్రిక్తతలు తగ్గించుకుని చర్చలు మొదలుపెట్టాలని కూడా చెప్పినట్లు పేర్కొన్నారు.

బంగ్లాకు షేక్ హసీనా.. కేంద్రం స్పందన ఇదే!

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తున్నట్లు ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా ప్రకటించడంపై రణధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు మాకు తెలిసింది. షేక్ హసీనా విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. ఉండబోదు. ఆమె తిరిగి వెళ్లడమనేది పూర్తిగా న్యాయ ప్రక్రియతో కూడుకున్నది. సంబంధిత నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది’ అని తేల్చి చెప్పారు. అలాగే, బంగ్లాతో భారత్ సంబంధాల బలోపేతానికి సంబంధిత వ్యవస్థల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>