కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఫేక్ ఓట్లను, ఓటర్ల జాబితాను అప్ డేట్ చేయడం కోసం ఓటర్ల సవరణ ప్రక్రియ (Telangana SIR)ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోనూ ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఈ ప్రక్రియపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఎన్నికల కమిషన్‌కు కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతుందని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో సగటున 21 శాతం మాత్రమే సర్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఈ ప్రక్రియ గడువు ఇంకా 10 రోజులు సమయం మాత్రమే ఉందని.. దీనిని పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ జిల్లా మంత్రిగా తమ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు ఎన్నికల కమిషన్‌ను కలిసినట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా 4,500 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయని.. అర్బన్‌లో ఓటరు సవరణ సరిగా జరగడం లేదని అన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సర్ ప్రక్రియ సజావుగా జరుగుతోందని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫారాలను పూర్తి చేసేందుకు బీఎల్వోలకు అవసరమైతే విద్యార్థుల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు.
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ టీచర్లు, జీహెచ్ఎంసీ సహకారం తీసుకోవాలని కోరుతున్నామని మంత్రి చెప్పారు. బీఎల్వోలు ఇళ్లలోకి రావడం లేదని.. ఫారాలు సరిగా ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్వోలకు ఎలాంటి సమస్య లేకుండా వారి పేమెంట్ కూడా ప్రభుత్వం చేసిందని చెప్పుకొచ్చారు. ఒక్క ఓటు కూడా కోల్పోవద్దని ముందు నుంచి తమ పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పార్టీ క్యాడర్ క్రియాశీలంగా పని చేయాలని కోరారు.

