కలం, వెబ్ డెస్క్: యూపీఎస్సీ సివిల్స్ (Civils Coaching) పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తెలంగాణ బీసీ అభ్యర్థులకు భారీ శుభవార్త. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతున్నట్లు బీసీ ఉపాధి, శిక్షణాభివృద్ధి కేంద్రం ప్రకటించింది. 2027లో జరిగే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు కలిపి ఆగస్టు 24వ తేదీ నుంచి 2027 మే వరకు కోచింగ్ ఇవ్వబోతున్నారు.
150 మందికే అవకాశం..
150 మందికి మాత్రమే కోచింగ్ అవకాశం కల్పిస్తారు. వీరిలో 50 మందిని ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కోసం సన్నద్ధమయ్యేవారిని తీసుకుంటారు. వీరికి ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. ప్రిలిమ్స్ క్వాలిఫై కార్డుతో సంప్రదిస్తే చాలు.. నేరుగా ప్రవేశం పొందవచ్చు. మిగిలిన వంద సీట్ల కోసం స్క్రీనింగ్ టెస్ట్ పెడుతారు. దీనిలో అర్హత సాధించిన వారికే కోచింగ్ ఇస్తారు.
ప్రతి నెలా రూ.5 వేల స్టైఫండ్..
అభ్యర్థికి ప్రతి నెలా రూ.5 వేలు స్టైఫండ్ కింద అందిస్తారు. బుక్స్ కొనుగోలు చేసుకునేందుకు ఒకేసారి అదనంగా రూ.5 వేలు అందిస్తారు. ఈ స్టడీ సర్కిల్లో అత్యంత అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో సబ్జెక్టుల వారీగా కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రతి వారం మాక్ టెస్టులతో పాటు వాటిని మూల్యాంకనం చేసి అభ్యర్థికి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తారు.
వీరు మాత్రమే అర్హులు..
యూపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ అర్హతలు పూర్తిగా కలిగి ఉండాలి. కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ.2 లక్షల ఆదాయం మాత్రమే ఉండాలి. అభ్యర్థులు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండొద్దు. అలాగే, ఇతర కోర్సులు కూడా చదువుతూ ఉండొద్దు. పూర్తిగా సివిల్స్ పరీక్షల కోసమే ప్రిపేర్ అవుతుండాలి. ఇంతకుముందు, ప్రభుత్వం నిర్వహించిన కోచింగ్ కూడా తీసుకుని ఉండొద్దు.
ఇవే ముఖ్యమైన తేదీలు..
సివిల్స్ కోచింగ్ కోసం రేపు (జులై 15) నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. జులై 17వ తేదీ నుంచి ఆగస్ట్ 7వ తేదీ వరకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్ట్ 13 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 16న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 19న ఫలితాలను ప్రకటిస్తారు. ఆగస్ట్ 21న సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 24వ తేదీ నుంచి హైదరాబాద్ సైదాబాద్‌లోని లక్ష్మినగర్ కాలనీలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో సివిల్స్ కోచింగ్ ప్రారంభిస్తారు. పూర్తి వివరాల కోసం 040-24071178, 7780359322 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

