కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ(Telangana) రాజకీయాలు మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో అప్పుల అంశంపై మాటల యుద్ధం సాగించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాళేశ్వరం విషయంలో పరస్పర విమర్శలు, సవాళ్లకు దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టే రాబోయే రోజులలో ప్రధాన రాజకీయ అస్త్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని బీఆర్ఎస్ చెబుతుండగా.. అది కాళేశ్వరం కాదు “కూలేశ్వరం” అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దాదాపు లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 2019 జూన్ 21న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అయితే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడంతో ప్రాజెక్టు పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి.
బీఆర్ఎస్ వాదన ఇదే
కాళేశ్వరం ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతమని, తెలంగాణ రైతులకు వరప్రదాయినిగా నిలిచిందని బీఆర్ఎస్ (BRS) వాదిస్తోంది. కొన్ని పిల్లర్లు దెబ్బతిన్న కారణంగా మొత్తం ప్రాజెక్టును పక్కన పెట్టడం సరికాదని పేర్కొంటోంది. మేడిగడ్డలో నీటిని నిల్వ చేసి, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని డిమాండ్ చేస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ఆదుకోవాలంటే పంపులను ప్రారంభించాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ కౌంటర్
కాళేశ్వరం నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిపుణుల సూచనలు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతోంది. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయడం, పంపింగ్ చేయడం ప్రమాదకరమని నిపుణులు సూచించారని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కాళేశ్వరం లేకున్నా రాష్ట్రం వ్యవసాయ రంగంలో ముందుకు సాగిందని, భారీ స్థాయిలో ధాన్యం దిగుబడులు సాధించామని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
కేటీఆర్ ఎంట్రీతో మారిన రాజకీయ సమీకరణాలు
గతంలో అప్పుల అంశంపై సాగిన చర్చ ఒక్కసారిగా కాళేశ్వరం వైపు మళ్లడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కారణమైందనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించిన కేటీఆర్ ప్రభుత్వం వెంటనే మోటార్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశంలో హరీశ్‌రావుకు మంచి అవగాహన ఉన్నప్పటికీ, కేటీఆర్ ముందుండటం పార్టీలో చర్చకు దారితీసింది. కేసీఆర్ అసెంబ్లీలో స్వయంగా వివరణ ఇస్తేనే ఈ అంశానికి ముగింపు లభిస్తుందని బీఆర్ఎస్ వర్గాలలో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?
కాళేశ్వరం అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ హాజరై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో అసెంబ్లీ వేదికగా మరోసారి కాళేశ్వరం అంశం ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది.
కాళేశ్వరం వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో బీజేపీ కూడా చేరింది. కాళేశ్వరం అవకతవకలపై చర్యలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సీబీఐ విచారణ కోరినా కేంద్రం స్పందించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై కేంద్రం నిర్ణయం ఏమిటన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల వరకు కాళేశ్వరమే ప్రచారాస్త్రమా?
కాళేశ్వరం సాంకేతికంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? నీటిని నిల్వ చేయడం, పంపింగ్ చేయడం సాధ్యమా? అనే అంశాలను నిపుణులు తేల్చాల్సి ఉంది. కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఇది ఇప్పటికే ప్రధాన ప్రచార అంశంగా మారింది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కాళేశ్వరం చుట్టూ రాజకీయ వేడి కొనసాగుతుందా? లేక దీనికి త్వరలోనే ముగింపు లభిస్తుందా? అన్నది తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

