కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య విరాళాల స్కామ్ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఆదేశించింది. అందులో సిట్ సభ్యుల వివరాలు కూడా పొందుపరచాలని సూచించింది. అయోధ్య విరాళాల స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనాతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఆలయ నిర్వహణను చూసుకుంటున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంతకుముందు వాదనలు వినిపిస్తూ.. ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. అయితే ఆ రిపోర్టును తమకు కూడా ఇవ్వాలని పిటిషనర్లు కోరగా.. అందుకు కోర్టు నిరాకరించింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
గోవధ నిషేధం ఉత్తర్వులపై స్టే
మరోవైపు తమిళనాడులో గోవధ నిషేధం అమలు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బక్రీద్, ఇతర రోజుల్లో రాష్ట్రంలో గోవధ జరగకుండా 1976 నాటి ఉత్తర్వులను అమలు చేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దీనిపై విజయ్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. నిర్దిష్ట ప్రదేశాల్లో కొన్ని రకాల గోవుల వధకు చట్టం అనుమతిస్తున్నదని.. జంతు సంరక్షణ, స్లాటర్ హౌస్‌లకు సంబంధించి తగిన చట్టాలు ఉన్నాయని, అవేవీ పూర్తి నిషేధాన్ని విధించడం లేదని వాదనలు వినిపించింది. వీటితో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
చట్టానికి లోబడే పౌరసత్వం
పౌరసత్వ ధ్రువీకరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత ఓటర్ల జాబితాలోని చిన్న చిన్న తప్పులను సాకుగా చూపి, తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అస్సాంకు చెందిన 27 మంది సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం.. ‘‘అక్రమంగా పౌరసత్వం పొందకుండా ఆపే అధికారం కేంద్రానికి ఉంది. అయితే పౌరసత్వ ధ్రువీకరణ చట్టబద్ధంగా జరగాలి. ట్రైబ్యునళ్లు మరోసారి విచారణ జరిపే వరకు వీళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు” అని ఆదేశించింది.
విమాన టికెట్ చార్జీల దోపిడీపై మరో తీర్పు
విమాన టికెట్ చార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీయ వాయుయాన్ అధినియం–2024 చట్టం కింద ఉన్న నిబంధనలేంటో తెలయిజేయాలని సూచించింది. ఇందుకు రెండు వారాలు గడువు ఇస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.
కర్నాటక ఆలయాల్లో ఎస్ఓపీ
ఇదిలాఉంటే అయోధ్య వివాదం నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో భద్రత, పారదర్శకత కోసం పలు చర్యలు చేపట్టింది. హుండీల భద్రత, విరాళాల నిర్వహణ, ఆలయాల్లో నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల భద్రతకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ (ఎస్ఓపీ) చేసింది. హుండీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, హుండీ లెక్కింపు నుంచి బ్యాంక్‌లో జమ చేసే వరకు వీడియో రికార్డింగ్ చేయాలని, డిజిటల్ విరాళాలను ప్రోత్సహించాలని, విరాళాలపై ప్రతివారం ఆడిట్ నిర్వహించాలని అందులో సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ ఇది అమలు చేయాలని ఆదేశించింది.

