18 ఏళ్ల బంధానికి ముగింపు.. సీఎస్‌కేకు ఫ్లెమింగ్ ఎమోషనల్ వీడ్కోలు

కలం, స్పోర్ట్స్ : చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK)లో ఓ శకం ముగిసింది. దాదాపు 18 ఏళ్ల పాటు జట్టుతో కలిసి పనిచేసిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) సీఎస్‌కేకు వీడ్కోలు పలికారు. ఇరు వర్గాల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. 2008లో తొలి ఐపీఎల్ సీజన్‌లో ఫ్లెమింగ్ ఆటగాడిగా సీఎస్‌కేలో చేరారు. 2009 నుంచి హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టారు.

అప్పటి నుంచి జట్టును విజయాల బాటలో నడిపించారు. ఆయన హయాంలో సీఎస్‌కే (CSK) ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచింది. రెండు చాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు సొంతం చేసుకుంది. 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. 10 సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడింది. ఫ్రాంచైజీ విడుదల చేసిన ప్రకటనలో ఫ్లెమింగ్ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. సీఎస్‌కేతో గడిపిన సమయం తన కోచింగ్ కెరీర్‌లో అత్యంత విలువైనదని చెప్పారు.

విజయాలు, కష్టాలు, మరపురాని జ్ఞాపకాలు ఎప్పటికీ తనతో ఉంటాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సీఎస్‌కేకు మద్దతుగా ఉంటానని తెలిపారు. సీఎస్‌కే కూడా ఫ్లెమింగ్ సేవలను గుర్తు చేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు జట్టు గుర్తింపు, లక్ష్యం, విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొంది. మైదానంలో కలిసి ప్రయాణం ముగిసినా, జట్టు చరిత్రలో ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని వెల్లడించింది.

ఇదిలా ఉంటే, గత మూడు సీజన్లుగా సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. దీంతో ఫ్రాంచైజీ క్రికెట్ కార్యకలాపాలను సమీక్షిస్తోంది. కోచింగ్ విభాగంలో కూడా మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సీఎస్‌కే కోచింగ్ బృందంలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>