కలం, స్పోర్ట్స్: లండన్ సెంటర్ కోర్టులో జాన్నిక్ సిన్నర్ (Jannik Sinner) మరోసారి గర్జించాడు. ఉత్కంఠభరిత ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను మట్టి కరిపించి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించాడు. వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ టైటిల్‌ను ముద్దాడాడు.
ఆదివారం రాత్రి సాగిన సుదీర్ఘ పోరాటంలో ఇటలీ స్టార్ సిన్నర్ 6-7 (7-9), 7-6 (7-2), 6-3, 6-4 తేడాతో జర్మనీ వీరుడు జ్వెరెవ్‌ను ఓడించాడు. తొలి సెట్ చేజారినా సిన్నర్ అద్భుతంగా పుంజుకున్నాడు. 3 గంటల 46 నిమిషాల పాటు చెమటోడ్చి విజేతగా నిలిచాడు.
ఆరంభం నుంచే జోరు మీద..
మ్యాచ్ ప్రారంభం నుంచే ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. తొలి సెట్లో జ్వెరెవ్ పవర్ఫుల్ సర్వీసులతో సిన్నర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. టైబ్రేకర్ వరకు వెళ్లిన ఈ సెట్‌ను జ్వెరెవ్ 7-6 (9-7)తో గెలుచుకున్నాడు. రెండో సెట్లో సిన్నర్ తన క్లాస్ గేమ్ చూపించాడు.
జ్వెరెవ్ సర్వ్‌లను సమర్థవంతంగా తిప్పికొట్టాడు. ఈసారి టైబ్రేకర్లలో ఏమాత్రం తడబడకుండా 7-6 (7-2)తో సెట్ గెలిచి మ్యాచ్‌ను సమం చేశాడు. ఆ తర్వాత సిన్నర్ జోరు పెంచాడు. మూడో సెట్‌ను 6-3తో, నాలుగో సెట్‌ను 6-4తో వరుసగా దక్కించుకుని ఛాంపియన్‌గా నిలిచాడు.
మొదట్లో జ్వెరెవ్ ఆధిక్యంలో..
గణాంకాల పరంగా ఇద్దరు ఆటగాళ్లు కోర్టులో ప్రాణం పెట్టారు. జ్వెరెవ్ ఏకంగా 17 ఏస్‌లు సంధించాడు. సిన్నర్ 15 ఏస్‌లతో గట్టి పోటీ ఇచ్చాడు. ఇద్దరూ చెరో 2 డబుల్ ఫాల్ట్స్ చేశారు. జ్వెరెవ్ ఫస్ట్ సర్వ్ శాతం (76%) మెరుగ్గా ఉంది.
కానీ కీలక పాయింట్లు సాధించడంలో సిన్నర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఫస్ట్ సర్వ్ వేసినప్పుడు సిన్నర్ 80% పాయింట్లు గెలిచాడు. జ్వెరెవ్ 72% కే పరిమితమయ్యాడు. సెకండ్ సర్వ్ పాయింట్లలోనూ సిన్నర్ (68%) ఆధిక్యం ప్రదర్శించాడు.
మ్యాచ్ మలుపు అక్కడే..
కీలక బ్రేక్ పాయింట్లు: జ్వెరెవ్‌కు లభించిన ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశాన్ని సిన్నర్ (Jannik Sinner) సమర్థవంతంగా అడ్డుకున్నాడు (0/1). సిన్నర్ మాత్రం తనకు వచ్చిన 5 బ్రేక్ పాయింట్లలో 2 కన్వర్ట్ చేసుకుని (2/5) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
చివరికి రిసీవింగ్ పాయింట్లలో 43-34 తేడాతో, మొత్తం పాయింట్లలో 145-130 ఆధిక్యంతో సిన్నర్ నిలకడైన ఆటతీరును చాటుకున్నాడు. వింబుల్డన్ ట్రోఫీని మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు.
Read Also: ఆయనకు సారీ చెప్పిన కేటీఆర్.. కారణమిదే!
Follow Us On: Instagram

