కలం, వెబ్ డెస్క్: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ప్రకటించారు. చిన్న గ్రామ పంచాయతీలకు రూ. 5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ తన సొంత నియోజకవకర్గం కొడంగల్‌లో (Kodangal) కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ’ఎన్నికలు ముగిశాయి.. ఇక రాజకీయాలు లేవు. ఏ పార్టీ మద్దతుతో ఎన్నికైన సర్పంచ్ అయినా ప్రభుత్వానికి ఒక్కటే. అందరినీ సమానంగా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు అందిస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులకు ఈ నిధులు అదనమని స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో ఈ ప్రత్యేక నిధులను అందజేస్తామని తెలిపారు. “ప్రభుత్వం సర్పంచులకు అండగా నిలుస్తుంది. మార్చి 31 లోపు గ్రామ పంచాయతీలకు రావలసిన ౩ వేల కోట్ల రూపాయలను తెప్పించే బాధ్యత తీసుకుంటా. చదువు ఒక్కటే నిరుపేదల జీవితాలను మార్చగలదు. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమం చేపట్టబోతున్నాం.‘
‘ప్రజలు ఆశీర్వదించి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చాం. ఇంకా ఎవరికైనా రాకపోతే సర్పంచులు ఇళ్లిళ్లు తిరిగి తేల్చితే ఇంకా రేషన్ కార్డులు రానివారికి ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిది. అర్హులైన ప్రతి పేద వాడికి సన్నబియ్యం అందాలి. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఇంకా ఎవరికైనా రాకపోతే అందరికీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 200 యూనిట్లలోపు వాడుకున్న వారికి ఉచిత విద్యుత్ అందకపోతే ఆ కుటుంబాల పేర్లను కూడా రాసుకోండి.‘
రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించాం. ఇంకా ఎవరికైనా ఆ జాబితాలో పేర్లు రాకపోతే వారి పేర్లను కూడా నమోదు చేయండి. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఎవరైనా ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు డబ్బు అడిగితే చెప్పండి. తెలంగాణ ఆడబడ్డలు కోటిమందికి కోటి ఇందిరమ్మ చీరలను సారెగా అందించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు చీర అందాలి. ఎవరికైనా అందకపోతే సర్పంచులు స్వయంగా వారి పేర్లను నమోదు చేయాలి.
కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 180 గ్రామ పంచాయతీల్లో ప్రజల తీర్పును గౌరవించి ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలని, అభినందించాలని, వారు తిరిగి గ్రామాలకు వెళ్లి ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజా సేవ చేయాలని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం.’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: ‘ఏఐ’ సాయంతో పరీక్షల్లో కాపీయింగ్ ..
Follow Us On: Instagram


