కలం మెదక్ బ్యూరో : గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ (Gajwel Congress ) గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతున్నది. నియోజకవర్గ ఇంచార్జ్ తూంకుంట నర్సారెడ్డి తీరుపై సొంతపార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నర్సారెడ్డి పీసీసీ చీఫ్ నిర్ణయాలను ధిక్కరించడంతో కేడర్ అయోమయంలో పడిపోయింది. ఈ నియోజకవర్గంలో కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోవాలని హైకమాండ్ భావిస్తుంటే గ్రౌండ్ లెవెల్ లో నేతలు కొట్టుకొనే పరిస్థితి నెలకొన్నది.
పీసీసీ చీఫ్‌పైనే తిరుగుబాటు.. !
తూంకుంట నర్సారెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకాలనే పక్కనపెట్టి సొంతంగా కమిటీలను ప్రకటించారు. ఇటీవల తూఫ్రాన్ టౌన్, తూప్రాన్, మనోహరాబాద్ మండల కాంగ్రెస్ కమిటీలను పీసీసీ అధికారికంగా ప్రకటించింది. మనోహరాబాద్ మండల అధ్యక్షుడిగా జూపల్లి మల్లారెడ్డిని, తూప్రాన్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డిని, తూప్రాన్ పట్టణ అధ్యక్షుడిగా నర్సింగరావును నియమించింది. అయితే నియోజకవర్గ ఇంచార్జ్ అయిన తనకు మాటమాత్రమైనా చెప్పకుండా పీసీసీ ఏకపక్షంగా కమిటీలను ప్రకటించిందని నర్సారెడ్డి తిరుగుబాటు చేశారు.
సొంత కమిటీల ఏర్పాటుతో రచ్చ
నర్సారెడ్డి తన అనుచరులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తూప్రాన్ మండల అధ్యక్షుడిగా జింక మల్లేష్, టౌన్ అధ్యక్షుడిగా చిన్న భగవాన్‌రెడ్డి, మనోహరాబాద్ మండల అధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్‌ను నియమించారు. ఈ పోటాపోటీ కమిటీల ప్రకటనతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర అయోమయంలో పడిపోయింది. నర్సారెడ్డి వ్యవహారశైలిని పీసీసీ నియమించిన నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ గా నర్సారెడ్డిని నియమించింది పీసీసీ అనే విషయాన్ని ఆయన ఎందుకు మరిచిపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నర్సారెడ్డి సొంతంగా కమిటీలు ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయకుండా వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు.
గతంలోనూ విభేదాలు
రెండు నెలల కిందట తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రకటన కూడా వివాదంగా మారింది. ఈ పదవి సీనియర్ నేత శరణ్య భాస్కర్ రెడ్డికి వస్తుందని పార్టీ సీనియర్ నేతలు భావించారు. కానీ అనూహ్యంగా యమజాల కీర్తన విఠల్ రెడ్డికి చైర్మన్ పదవి, మామిండ్ల కృష్ణకు వైస్ చైర్మన్ పదవి దక్కాయి. పార్టీని నమ్ముకొని ఇన్నేళ్లుగా పనిచేసిన నిజమైన కార్యకర్తలను కాదని.. వలస వచ్చిన వారికి పదవులు దక్కడం వెనుక భారీగా నిధులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నామినేటెడ్ పోస్టుల కేటాయింపుల్లోనూ ఇలాగే జరిగిందని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. నర్సారెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కాంగ్రెస్ నేతలు, అనుచరులు తమ పదవులకు రాజీనామా పత్రాలతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు తరలివెళ్లారు. పీసీసీ చీఫ్ హామీతో వారంతా వెనుదిరిగారు.
తూంకుంట నర్సారెడ్డిపై తిరుగుబాటు
నర్సారెడ్డిపై పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. మండల అధ్యక్షుల నియామకాలు, తూప్రాన్ మార్కెట్ కమిటీ ప్రకటనలో నర్సారెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు నర్సారెడ్డి అమ్ముకుంటున్నారని కొందరు సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఎన్నోఏండ్లుగా పార్టీని నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలు, నాయకులను పట్టించుకోకుండా పదవులను అమ్ముకుంటున్నారని విమర్శించారు. పీసీసీ మీదే తిరుగుబాటు చేసిన నర్సారెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ ను ఎలా ఎదుర్కొంటాం ?
గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ కావడంతో ఆయనను నిలువరించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంలో బలపడాలని భావిస్తున్నది. అందులో భాగంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నది. అయితే నర్సారెడ్డి తీరుతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని సీనియర్లు ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ నేతలను పక్కన పెట్టి , డబ్బులు తీసుకొని పదవులు ఇస్తే కేసీఆర్ ను ఎలా ఎదుర్కొంటామని వారు ప్రశ్నిస్తున్నారు. నర్సారెడ్డి సొంతపార్టీని మోసం చేసి బీఆర్ఎస్ లోకి వెళ్లారని.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సీనియర్ నేతలపై కక్ష సాధిస్తున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నర్సారెడ్డి విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ఆయన ఒంటెద్దు పోకడల వల్లే గజ్వేల్‌లో కాంగ్రెస్ పుంజుకోలేకపోతుందని, కేసీఆర్‌కు కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని స్థానిక కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. మరి గజ్వేల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

