కలం, కరీంనగర్ బ్యూరో: అత్యవసర వైద్య సేవల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన కరీంనగర్ (Karimnagar) ప్రభుత్వ ఆస్పత్రి క్రిటికల్ కేర్ విభాగం (Critical Care Unit) ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ప్రారంభించి ఏడాది దాటుతున్నా వైద్య నిపుణుల నియామకం జరగకపోవడంతో అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరైంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.23 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసి అత్యాధునిక భవనాన్ని నిర్మించింది. గత ఏడాది జూలై 27న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విభాగాన్ని ప్రారంభించారు. అయితే భవనం సిద్ధమైనా కీలకమైన వైద్యుల నియామకం మాత్రం జరగలేదు. దీంతో న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ వంటి నిపుణుల సేవలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర పరిస్థితులలో వచ్చే రోగులను వరంగల్, హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు.
ప్రమాదాల బాధితులకు అందని అత్యవసర సేవలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులు ఎక్కువగా ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన వారిని సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చినా, అక్కడ పూర్తి స్థాయి క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రాణాపాయం ఎదురవుతోంది. గోల్డెన్ అవర్లో చికిత్స అందాల్సిన బాధితులు ఇతర నగరాలకు తరలించే క్రమంలో పరిస్థితి విషమిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు తప్పనిసరి పరిస్థితులలో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ట్రామా కేర్ పాలసీ ఎక్కడ?
రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ట్రామా కేర్ పాలసీని తీసుకొస్తామని గతంలో ప్రకటించింది. ఇందులో భాగంగా 911 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని, ఒక్కో కేంద్రానికి సుమారు రూ.5.3 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. హైవేలపై ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ చేరుకుని, బాధితులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందించేలా వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన వైద్య సదుపాయాలు సిబ్బంది లేక ఉపయోగంలోకి రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
గోల్డెన్ అవర్లో చికిత్సే ప్రాణరక్షణ
రోడ్డు ప్రమాదాలలో తొలి గంటను వైద్య రంగంలో గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఆ సమయంలో సరైన చికిత్స అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ట్రామా కేర్ సెంటర్లలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, బ్లడ్ బ్యాంక్ వంటి సౌకర్యాలతో పాటు ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, న్యూరో సర్జన్, అనస్థీషియా నిపుణులు, రేడియాలజిస్టులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రాణాపాయ పరిస్థితులలో తక్షణ వైద్యం అందించడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం. కానీ కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ యూనిట్ 24 గంటలూ సేవలు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం నిపుణుల కొరతతో లక్ష్యం నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన ఈ విభాగం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తేనే ప్రమాద బాధితులకు సమయానికి వైద్యం అందే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు.

