కలం, హుజూర్ నగర్: రాష్ట్ర రవాణా అవసరాలకు తగ్గట్లుగా 2,800 నూతన బస్సులను కొనుగోలు చేశామని, త్వరలోనే అన్ని బస్ డిపోలకు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. తద్వారా కొత్తగా 3,500 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని వివరించారు. శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హుజూర్ నగర్, కోదాడ నూతన బస్ స్టేషన్లకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి మంత్రి ఉత్తమ్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
30 లక్షల మంది మహిళల ప్రయాణాలు..
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.11 వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు జరిగాయన్నారు. ప్రతి రోజు 65 లక్షల మంది ప్రయాణిస్తుంటే.. వారిలో 30 లక్షల మంది మహిళలే ఉచితంగా వెళ్తున్నారని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించామని.. ఇప్పుడు 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని మంత్రి పొన్నం వివరించారు. కొత్తగా మరో రెండు డిపోలు కూడా మంజూరు చేసినట్లు అని వివరించారు.
గత ప్రభుత్వంలో కార్మికుల ఆత్మహత్యలు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేస్తే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉండేదన్నారు. కానీ తమ ప్రభుత్వం కార్మికుల సమస్యలకు కేవలం మూడు రోజుల్లోనే చర్చించి పరిష్కారం చూపిందన్నారను. ఉద్యోగులకు పీఆర్సీ, పెండింగ్ బాండ్లను క్లియర్ చేయడంతో పాటు కార్మిక సంఘాల ఎన్నికలకు ప్రక్రియ, విలీన ప్రక్రియను వేగంగా జరుపుతున్నామని స్పష్టం చేశారు.
ప్రతి రోజు పది వేల బస్సులతో..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 10 వేల బస్సులు, 45 వేల మంది ఉద్యోగులతో ఆర్టీసీ నిరంతరం సేవలు అందిస్తోందని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) తెలిపారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా 370 రూట్లలో ఏడు లక్షల మందికి అదనంగా బస్సులు నడుపుతున్నామని వివరించారు. బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రిగా గురుకుల పాఠశాలల్లో 98 శాతం అద్భుత ఫలితాలు సాధించామన్నారు. తన నియోజకవర్గమైన హుస్నాబాద్‌లో కాలువల భూసేకరణ కోసం రూ.200 కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు.
మాపై విమర్శలు ఎందుకు..
కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వమే కట్టిందని, వారి హయాంలోనే కూలిపోతే తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖలో పరిస్థితులను చక్కదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతంలో సిమెంట్, రైస్, గ్రానైట్ ఉత్పత్తి భారీగా జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాల మధ్య పోటీ పడి మరీ అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్ని రంగాల్లో కోదాడ అభివృద్ధి..
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ ఆర్టీసీ డిపో అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. అత్యాధునిక సదుపాయాలతో కొత్త బస్ స్టేషన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండటం అభినందనీయమన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన దెబ్బతిన్న ఎత్తిపోతల పథకాలను తాము అధికారంలోకి వచ్చాక పునరుద్ధరించామన్నారు. రాబోయే రోజుల్లో కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Read Also: ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత
Follow Us On: Instagram

