కలం, వెబ్ డెస్క్: ఏపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆస్తి మొత్తాన్ని లాక్కొని తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. మళ్లీ ఇంటికి వెళ్తే చంపేస్తాడన్న భయంతో ఆ తండ్రి బయటే అద్దెకు ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ రోజు తన సమస్య చెప్పుకునేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే వరదా సరోజమ్మ భర్త వరదా వెంకట గోవింద రాజు (Varada Govinda Raju) నేడు సీఎం చంద్రబాబును కలిశారు. తన సమస్యను సీఎంతో చెప్పుకున్న తర్వాత ఆయన తన కుమార్తెలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
వరదా గోవింద రాజు తనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడని తెలిపారు. 30 ఏళ్ల క్రితం ఆయన నాగావళి హోటల్‌ను స్థాపించినట్లు చెప్పారు. తన కొడుకు ఇప్పుడు ఆ హోటల్‌తో సహా తమ ఆస్తులన్నింటిని లాగేసుకొని (Property Dispute) తనను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడన్నారు. తన సమస్యలపై ఇప్పటికే స్థానిక పోలీసులు, ఎస్పీ, కలెక్టర్.. ఇలా అందరికీ చెప్పుకున్నా ఎవరూ న్యాయం చేయడం లేదన్నారు. మూడేళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
తన కుమార్తెల్లో ఒకరు అమెరికా, ఒకరు హైదరాబాద్‌లో ఉంటారని, ఈ వయసులో కొడుకు ఇలా కష్టపెడుతున్నాడని బాధ పడ్డారు. సీనియర్ సిటిజన్ అయ్యుండి ఇంత కష్టపడుతున్నా పోలీసులు, అధికారులు ఎవరూ తన సమస్యకు పరిష్కారం చూపించలేదన్నారు. తన కొడుకు నుంచి ప్రాణహాని కూడా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తనకు 91 ఏళ్లు అని, ఇంకా కొడుకుతో పోరాడలేనని స్పష్టం చేశారు. అందుకే చివరి ఆశతో సీఎం చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. పోలీసులు, అధికారుల తీరుపై గోవింద రాజు కుమార్తెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్ల రక్షణ వారి బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. మూడేళ్ల నుంచి మున్సిపాలిటీ, పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని చెప్పారు.
Read Also: ఇంటి అద్దె పెంచడం ఓనర్ ఇష్టమా.. చట్టం ఏం చెప్తోంది?
Follow Us On: X(Twitter)

