కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలో రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా మార్చి 2027 నాటికి మూడు విడతల్లో భూ రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ, గృహ నిర్మాణ రంగాలపై మంత్రి కీలక సమీక్ష జరిపారు.
నోటీసులు ఇస్తూ పరిష్కరించాలి..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘భూ భారతి’ (Bhu Bharati) చట్టం విజయవంతం కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని స్పష్టం చేశారు. తొలి విడతగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేశామని, శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగిస్తూ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ధరణి కాలం నాటి 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తులు అధిక సంఖ్యలో తిరస్కరణకు గురికావడంపై ఆరా తీసిన మంత్రి.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇస్తూ వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఒకే సర్వే నంబరులో కొంత భూమిని సేకరించి, మొత్తం భూమిని నిషేధిత జాబితాలో పెట్టడం వంటి పొరపాట్లను వెంటనే సరిదిద్దాలని సూచించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..
గృహ నిర్మాణాలపై సమీక్షిస్తూ.. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండవ విడత లబ్ధిదారుల ఎంపికలో గుడిసెల్లో నివసించే పేద కుటుంబాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇసుక, కంకర సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉన్నదున్నట్లుగా లబ్ధిదారులకు అప్పగించి.. మిగిలిన పనులకు నిధులు ఇవ్వాలని సూచించారు. అలాగే, రానున్న ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ కనీసం ఒక జత యూనిఫాం అందేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని పొంగులేటి (Ponguleti) ఆదేశించారు.
Read Also: మోటార్లకు మీటర్ల అంశం.. రైతులకు సర్కార్ గుడ్ న్యూస్
Follow Us On: Sharechat

