కలం, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఒక పెద్ద మోసం (TTD Job Scam) వెలుగులోకి వచ్చింది. టీటీడీ లోగోతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను సృష్టించి, దాదాపు 30 మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ.5 కోట్లకు పైగా వసూలు చేసిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు కిరణ్ కుమార్ తనను తాను అడ్వకేట్‌గా పరిచయం చేసుకుంటూ నిరుద్యోగులను టార్గెట్ చేసేవాడు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ (GM) సుబ్రహ్మణ్యం ద్వారా తనకు ఉన్నత స్థాయి సిఫార్సులు ఉన్నాయని, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితులను నమ్మించాడు. ఈ క్రమంలో ఒక్కో బాధితుడి నుంచి రూ.15 లక్షల నుండి రూ.50 లక్షల వరకు భారీ ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. డబ్బులు తీసుకున్న తర్వాత టీటీడీ అధికారిక లోగోతో కూడిన నకిలీ నియామక పత్రాలను (Fake Appointment Letter) వారికి అందజేశాడు.
అయితే, జాయినింగ్ తేదీల పేరుతో నిందితుడు నెలల తరబడి కాలయాపన చేయడంతో బాధితులకు అనుమానం వచ్చింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులంతా కలిసి తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 30 మందికి పైగా బాధితుల నుండి రూ.5 కోట్లకు పైగా మోసం జరిగినట్లు తెలుస్తోంది. బాధితులు నిందితుడు కిరణ్ కుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించగా, ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. టీటీడీ ఉద్యోగాల పేరుతో జరిగే ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని అధికారులు నిరుద్యోగులను హెచ్చరిస్తున్నారు.

