కలం, వెబ్ డెస్క్: బడ్జెట్ కోతలతో సరికొత్తగా మారుతున్న 2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల (Commonwealth Games) ప్రారంభోత్సవానికి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 (King Charles), క్వీన్ కమిల్లా హాజరవుతున్నారు. జూలై 23న ‘ది హైడ్రో’ వేదికగా జరిగే వేడుకలో ఆయన క్రీడలను అధికారికంగా ప్రారంభిస్తారు. గత ఏడాది బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తానే స్వయంగా బాటన్‌లో దాచిన రహస్య సందేశాన్ని ఈ సందర్భంగా రాజు చదివి వినిపిస్తారు. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈసారి కేవలం ఎనిమిది మైళ్ల పరిధిలోనే మొత్తం ఈవెంట్‌ను ముగించేలా ప్లాన్ చేశారు. కేవలం 10 ప్రధాన క్రీడాంశాల్లోనే పోటీలు జరగనున్నాయి.
ఈ 11 రోజుల క్రీడా పండుగలో 74 దేశాల నుంచి 3,000 మందికి పైగా అథ్లెట్లు 215 పసిడి పతకాల కోసం తలపడనున్నారు. భారత్ నుంచి 124 మంది అథ్లెట్లు ఈ రేసులో ఉన్నారు. చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా 500 రోజుల పాటు 74 దేశాల్లో తిరిగిన ప్రత్యేక బాటన్లు అన్నీ ఇప్పుడు గ్లాస్గోలో ఒకే చోటికి చేరనున్నాయి. సముద్రాలను ప్లాస్టిక్ రహితంగా మార్చే ప్రచారాన్ని కూడా ఈ బాటన్ రిలే విజయవంతంగా పూర్తి చేసింది. కింగ్ చార్లెస్ రాజు అయ్యాక జరుగుతున్న మొదటి కామన్వెల్త్ గేమ్స్ ఇవే కావడం విశేషం. ఈ సరికొత్త క్రీడా సమరం ఆగస్టు 2 వరకు సాగనుంది.

