కలం, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్(Education Bandh) సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సిపిఐ(CPI) నగర సమితి తీవ్రంగా ఖండించింది. విద్యార్థి ఉద్యమాలను పోలీసు బలంతో అణచివేయలేరని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు పేర్కొన్నారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, ప్రతి ఏడాది మాదిరిగానే గీతాభవన్ చౌరస్తా నుంచి బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన వామపక్ష విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని, ర్యాలీని అడ్డుకోవడమే కాకుండా వారిపై విచక్షణారహితంగా దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల మంజూరులో విఫలమైందని ఆరోపించారు. ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధాకరమని అన్నారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విద్యార్థులతో విభేదించిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువకాలం నిలవలేదని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలని, వారిపై దురుసుగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

