వనపర్తి అభివృద్ధిపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: గత 30 నెలలలో వనపర్తి నియోజకవర్గంలో రూ.2,147 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టి అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని వనపర్తి ఎమ్మెల్యే (Wanaparthy MLA) తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 17వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF), కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులు, పేద కుటుంబాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఆరోగ్య సేవల బలోపేతం, మహిళా సంఘాలకు చేయూత వంటి పథకాలు ప్రజల జీవితాలలో మార్పు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూ, ఫోన్ ట్యాపింగ్ వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి, భూకబ్జాలు, అధికార దుర్వినియోగం పెరగడంతో ప్రజలు తిరస్కరించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాటు సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు.

 రూ.79.89 కోట్ల ఆర్థిక సాయం

2026 జూలై 10 నాటికి వనపర్తి నియోజకవర్గంలో మొత్తం 13,167 మంది లబ్ధిదారులకు రూ.79.89 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. సీఎంఆర్ఎఫ్ కింద 7,371 మందికి రూ.18.05 కోట్లు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకం కింద 5,385 మందికి రూ.53.91 కోట్లు, ఎల్ఓసీ పథకం కింద 411 మందికి రూ.7.92 కోట్ల వైద్య సహాయం అందించినట్లు వివరించారు. వనపర్తి, పెద్దమందడి, ఖిల్లాఘనపురం, గోపాల్ పేట , రేవల్లి, ఏదుల, శ్రీరంగాపూర్, పెబ్బేరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఈ సందర్భంగా చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ చైర్మన్‌లు , వైస్ చైర్మన్‌లు, కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ ప్రతినిధులు, సర్పంచులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>