కలం, హనుమకొండ : భద్రకాళి ఆలయం (Bhadrakali Temple) మాడ వీధుల అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రభావితమైన కుటుంబాల జీవనోపాధికి భరోసా కల్పించే చర్యల్లో భాగంగా, అర్హులైన 30 మంది బాధితులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేశారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, నియామక పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. బాధిత కుటుంబాల జీవనోపాధి మెరుగుపడేలా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం ప్రాధాన్యంతో అమలు చేస్తోందని తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులకు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, గృహ, ఉపాధి పథకాల ప్రయోజనాలు కూడా అర్హులైన కుటుంబాలకు అందేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

