తెలంగాణకు శాపంగా రేవంత్ రెడ్డి: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: నీళ్లు ఉన్నా ఎత్తిపోయకుండా కిందకు వదిలిపెడుతూ తన గురువు చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. ఈ వైఖరి ఏపీకి వరంగా.. తెలంగాణకు శాపంగా మారిందని విమర్శించారు. మాట తప్పడం, పార్టీలు మారడం రేవంత్ రెడ్డి సంస్కృతి అని.. తనది కాదని స్పష్టం చేశారు. ఖమ్మం సభలో తనపై చేసిన ఆరోపణలను హరీశ్ రావు ఖండించారు.

ఎందుకు ఇంత ఆవేశం..?

రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తూ భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా ప్రమాణం చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. కనీసం ఖమ్మం జిల్లాలో అయినా వంద శాతం చేశావా.. అని ప్రశ్నించారు. ప్రతి బహిరంగసభలో ముఖ్యమంత్రి ఆవేశం, అసహనంతో ఎందుకు రగిలిపోతున్నారని మండిపడ్డారు.

రిటైర్డ్ ఇంజినీర్లను పట్టించుకోరా..?

కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పినా పట్టించుకోరా.. అని హరీశ్ రావు ప్రశ్నించారు. 28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమీ కాలేదని.. ఇప్పుడు ఎత్తిపోస్తే ఏదో జరిగిపోతుందని భ్రమలు కల్పిస్తున్నాడని మండిపడ్డారు. రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నా.. పంపులు ఆన్ చేయకపోవడం రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహమని పేర్కొన్నారు.

ఏపీలో ఎత్తిపోతలు మొదలు..

తెలంగాణ ప్రభుత్వం గోదావరిలో నీటిని కిందకు వదిలేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎత్తిపోతలు మొదలు పెట్టిందని హరీశ్ రావు వివరించారు. పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల ద్వారా రోజుకు మూడు టీఎంసీల చొప్పున 60 టీఎంసీలకు పైగా తరలించుకుపోయిందన్నారు.

24 మోటార్లు పెట్టి ఏపీ ప్రభుత్వం కృష్ణాకు ఒకవైపు నీళ్లు మళ్లిస్తూ.. 4 మెగావాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి చేసుకుంటోందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులు కట్టుకుని కూర్చుందని విమర్శించారు.

మంత్రులు ఏం చేస్తున్నారు..?

ఎల్లంపల్లి ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 20 టీఎంసీలకు గాను 5.48 టీఎంసీలున్నాయని.. ఈ నీటితో రామగుండ పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్ తాగునీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు.

ఇంత జరుగుతుంటే కరీంనగర్ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎల్లంపల్లి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ సహా ఇతర రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>