కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ టైమ్ ‘ఎథిక్స్ కమిటీ’ (Ethics Committee) ఏర్పాటైంది. సీనియర్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన మొత్తం ఏడుగురితో కూడిన ఈ కమిటీలో ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్, ఒక బీజేపీ, ఒక సీపీఐ ఎమ్మెల్యే సభ్యులుగా ఉన్నారు. ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయడంతోనే కొత్త చర్చలు మొదలయ్యాయి.
ఇకపైన ఎథిక్స్ కమిటీ కార్యాచరణ ఏంటి?.. దాని ముందు ఉన్న ఫిర్యాదులేంటి?.. వాటిని పరిశీలించి స్పష్టతకు రావడానికి ఎంత టైమ్ పట్టొచ్చు?.. ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశముంది?.. తీవ్ర స్వభావంతో కూడినదైతే చర్యలూ అంతే తీవ్రంగా ఉంటాయా?.. ఇలాంటివన్నీ చర్చనీయాంశంగా మారాయి. ఏయే సభ్యుల మీద ఎలాంటి ప్రవర్తనను ప్రదర్శించారు, దానికి దారితీసిన కారణాలు, సభా సంప్రదాయాలను ఉల్లంఘించడం.. వీటన్నింటిపై ఐదు పార్టీలతో కూడిన ఈ కమిటీ చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నది. ఆ నిర్ణయిం అనర్హత వరకూ వెళ్తుందా?.. లేక సస్పన్షన్ దగ్గర ఆగిపోతుందా?.. లేక హెచ్చరికతోనే సరిపెట్టే అవకాశమున్నదా?.. ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే కడియంపై కౌశిక్‌రెడ్డి వ్యవహారశైలి :
ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సెషన్ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో సహనం కోల్పోయి సైగలతో బెదిరించే తరహాలో వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళారు. సభా సమావేశాలు జరుగుతుండగానే, స్పీకర్ తన చైర్‌లో ఉండగానే కడియం శ్రీహరిని కౌశిక్‌రెడ్డి చేతులతో బెదిరించారని, హెచ్చరించారని, ఇలాంటి చర్యలు సభా సంప్రదాయాన్ని ఉల్లంఘించడమేనని, శాసనసభాపతిగా ఈ వ్యవహారంలో బధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదనల అనంతరం వీడియో ఫుటేజీని పరిశీలించి ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ఏర్పడడంతో చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి దీన్ని ఎప్పుడు విచారణకు తీసుకుంటారు.. కమిటీ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది.. దాని ఎజెండా ఏంటి.. వీడియో ఫుటేజీని పరిశీలించిన తర్వాత ఎలాంటి చర్చ జరగనున్నది.. ఇలాంటి అంశాలపై ఆసక్తి నెలకొన్నది.
కమిటీ నిర్ణయం తర్వాత ఏం జరగనున్నది? :
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగానే జరుగుతున్నాయి. చర్చల్లో ఆధిపత్యం నిరూపించుకోవడానికి అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. ఎమ్మెల్యే ఫిరాయింపు అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య సభలో మాటల యుద్ధమే కొనసాగింది. బడ్జెట్ సెషన్ సందర్భంగా మార్చి 28న అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో పాడి కౌశిక్‌రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ బీ-ఫామ్ తరఫున పోటీ చేసి గెలిచిన కడియం శ్రీహరి ఇప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యేనో చెప్పాలంటూ కామెంట్ చేశారు.
దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాదనలే జరిగాయి. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి సైగల ద్వారా కడియం శ్రీహరిని బెదిరించారని, అసెంబ్లీలోనే సభ్యులకు భద్రత, రక్షణ కరువైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ సభ్యులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. యువ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లు, మంత్రులు కౌశిక్‌రెడ్డి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లోని సీనియర్ సభ్యులు, మంత్రులుగా పనిచేసినవారు కౌశిక్‌రెడ్డి తీరును సమర్ధించగలరా అనే ప్రశ్నలూ వచ్చాయి.
సీఎం ఫిర్యాదుతో స్పీకర్ కీలక నిర్ణయం :
వయసులో, అనుభవంలో కేసీఆర్‌కు సరిపోయే వ్యక్తి కడియం శ్రీహరి అని, అలాంటి వ్యక్తిపై పాడి కౌశిక్ అభ్యంతరకమైన సైగలు చేయడం, బెదిరించడం సరైన పద్ధతి కాదని, రూల్స్ ప్రకారం కౌశిక్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సీఎం సూచించారు. సభలో కౌశిక్ చేసిన ప్రవర్తనపై స్పీకర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సభ సంప్రదాయాలను ఉల్లంఘించారనే కారణంతో కౌశిక్ రెడ్డి కేసును ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలంటూ స్పీకర్‌కు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు.
కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటుందని స్పీకర్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎథిక్స్ కమిటీ ఏర్పడలేదు. తాజాగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చైర్మన్ గా, మరో ఆరుగురు ఎమ్మెల్యేలను సభ్యులుగా ఎథిక్స్ కమిటీ నియామకమైంది. ఈ కమిటీలో బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. బీజేపీ నుండి పైడి రాకేష్ రెడ్డి, సీపీఐ నుండి కూనంనేని సభ్యులుగా ఉన్నారు. ప్రతిసారి స్పీకర్ పోడియంలోకి దూసుకె ళ్ళడం, సభకు అంతరాయం కలిగించడం రొటీన్ ప్రాక్టీసుగా మారిందని, చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కాంగ్రెస్ సభ్యులు కోరారు.
గత ప్రభుత్వంలో చర్యలపై పరిశీలన :
గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లను సభ నుండి శాశ్వతంగా తొలగించారని, దాని ప్రకారమే కౌశిక్‌ను సైతం సభ నుండి శాశ్వతంగా తొలగించి ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదన్న మాటలూ వినిపిస్తున్నాయి. సీనియర్ సభ్యుడిని, దళిత ఎమ్మెల్యే పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కౌశిక్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకుంటే మిగతా వారికి ఒక హెచ్చరికలాగా ఉంటుందన్న అభిప్రాయామూ పలువురు ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతున్నది.
ప్రస్తుత అసెంబ్లీలో ఫస్ట్ టైమ్ ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నందున వారికి సభ మర్యాదలు తెలియాలంటే కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌లో ఎథిక్స్ కమిటీ కఠినంగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి 20 కమిటీలు నియామకమైనా ఎథిక్స్ కమిటీపైనే సభ్యుల మధ్య ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఎథిక్స్ కమిటీ (Ethics Committee) టేబుల్ పై ఉన్న కౌశిక్ రెడ్డిపైకేసుపై కమిటీ ఏం చర్చిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఆసక్తికరంగా మారింది.

