Mobile Popup Ad
Mobile Popup Ad

సన్‌షైన్ ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలి: AIFB

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని సన్‌షైన్ హాస్పిటల్స్ (Sunshine Hospitals) యాజమాన్యం సాగిస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలు, నార్కోటిక్ డ్రగ్స్ దుర్వినియోగంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో 27 డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల తంగేళ్ల కిరణ్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామెర బద్రి నేత , రావుల ఆదిత్య నాయకులు ప్రవీణ్ తో కలసి బండారి శేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

కరీంనగర్ జిల్లా ఔషధ నియంత్రణ శాఖ (DCA) గతంలో సమర్పించిన నివేదిక ప్రకారం.. సన్‌షైన్ హాస్పిటల్స్‌లో నార్కోటిక్ డ్రగ్స్ , సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) మందుల అక్రమ వినియోగం, తీవ్ర దుర్వినియోగం జరిగిందని స్పష్టమైన ఆధారాలతో జిల్లా DM&HO కు నివేదిక ఇవ్వడం జరిగిందని బండారి శేఖర్ తెలిపారు. ఇంతటి తీవ్రమైన నేరం రుజువైనప్పటికీ, ఇప్పటి వరకు ఆసుపత్రి యాజమాన్యంపై గానీ, సదరు వైద్యులపై గానీ ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. కొందరు ప్రభుత్వ అధికారులు సన్‌షైన్ హాస్పిటల్స్ యాజమాన్యానికి చట్టవిరుద్ధంగా సహకరిస్తున్నారని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు తీవ్ర భంగం కలుగుతోందని ఆయన ఆరోపించారు.

నిబంధనల ఉల్లంఘన- అధికారుల నిర్లక్ష్యం

సన్‌షైన్ ఆసుపత్రి నిర్వహణ ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940’, ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నియమావళి 1945’ మరియు ‘NDPS చట్టం 1985’ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా సాగుతోందని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నివేదికలే చెబుతున్నాయని శేఖర్ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వైద్యుల ప్రాక్టీస్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కి అధికారికంగా ఫిర్యాదు సమర్పించనున్నట్లు వెల్లడించారు.మరోవైపు సన్‌షైన్ హాస్పిటల్స్ యాజమాన్యానికి ఫైర్ అనుమతులు (NOC) లేవని, ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేవని ఫైర్ అధికారుల పునఃసమీక్షా నివేదికలో తేలిందన్నారు.

ఇంతటి తీవ్రమైన లోపాలు ఉన్న ఆసుపత్రికి కేవలం లక్ష రూపాయల జరిమానా విధించి వదిలేయడం తీవ్రమైన అన్యాయమన్నారు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగి అమాయక రోగుల ప్రాణాలు పోయాక స్పందించడం కంటే, ముందే తగిన కఠిన చర్యలు తీసుకోవడం అత్యవరసరమని ఆయన హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్’ కింద నిబంధనలను బేఖాతరు చేస్తూ నడుస్తున్న సన్‌షైన్ హాస్పిటల్స్‌ను తక్షణమే సీజ్ చేసి, దాని రిజిస్ట్రేషన్ మరియు హాస్పిటల్ ఫార్మసీ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలన్నారు. NDPS చట్టం, 1985 మరియు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 నిబంధనలను ఉల్లంఘించిన హాస్పిటల్ యాజమాన్యంపై, బాధ్యులైన డాక్టర్లపై వెంటనే క్రిమినల్ కేసులు (FIR) నమోదు చేయాలని స్పష్టం చేశారు.

కరీంనగర్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌ తక్షణమే కోర్టులో ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940’ ప్రకారం చట్టపరమైన ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. ఆసుపత్రి యాజమాన్యంతో కుమ్మకై తప్పుడు నివేదికలు సమర్పించి, ప్రజా ప్రాణాలతో చెలగాటమాడిన అప్పటి DM&HO, ఫైర్ అధికారులపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించకుంటే ప్రజా రక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బండారి శేఖర్ హెచ్చరించారు.

అన్ని రకాల ఆధారాలతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం (DCA)కి , డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ, హైదరాబాద్ కి, ప్రెసిడెంట్/రిజిస్ట్రార్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC), హైదరాబాద్ లకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>