కలం, వరంగల్ బ్యూరో : పెండింగ్లో ఉన్న బకాయి బిల్లులను విడుదల చేయాలంటూ ఓ కాంట్రాక్టర్ ఏకంగా పాఠశాలకే తాళం వేసి నిరసన తెలిపిన ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో జరిగింది. జిల్లాలోని సీరోల్ మండలం గోపతండ ప్రాథమిక పాఠశాలలో ఈ విచిత్ర పరిస్థితి చోటు చేసుకుంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మన ఊరు–మన బడి” కార్యక్రమంలో భాగంగా గోపతండ ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ.2 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను సదరు కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అయితే, పనులు పూర్తయిన తర్వాత అధికారులు కేవలం సగం మొత్తాన్ని మాత్రమే చెల్లించి, మిగిలిన బకాయిలను నిలిపివేశారని సదరు కాంట్రాక్టర్ ఆరోపించారు. పనుల కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా కాలయాపన తప్ప ఏమాత్రం స్పందన లేదని.. అందుకే చివరి మార్గంగా పాఠశాలకు తాళం వేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
తాను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేసి తనకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్ డిమాండ్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటనతో రాష్ట్రంలో కాంట్రాక్టర్ల బకాయి బిల్లుల సమస్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

