కలం, ఖమ్మం బ్యూరో: లైసెన్స్డ్ సర్వేయర్లకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి, నెలకు రూ.30 వేల స్థిర వేతనం చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం ఖమ్మం (Khammam) జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వేయర్లు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్ డేలో కలెక్టర్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
శిక్షణ ఇచ్చి వదిలేసింది..
అసోసియేషన్ ప్రెసిడెంట్ గుగులోత్ శ్యామ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు సర్వే రంగంలో శిక్షణ ఇచ్చి, తర్వాత ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించకుండా వదిలేసిందని మండిపడ్డారు. ఎకరం భూమిని సర్వే చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన రూ.50 రుసుము ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ప్రయాణ ఖర్చులకు కూడా చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరాలోచన చేసి, తమను కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
బంగారయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి..
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్యోగం లేదనే మనస్తాపంతో మృతి చెందిన లైసెన్స్డ్ సర్వేయర్ బంగారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ వినతులను పరిశీలించని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్, కోశాధికారి దామాల మణి, జిల్లా కన్వీనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

