కలం, పాలకీడు: చట్టాన్ని ఉల్లంఘించినా.. మహిళల భద్రతకు భంగం కలిగించినా ఎంతటి వారికైన కఠిన చర్యలు తప్పవని పాలకీడు సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్ స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలను అతిక్రమించి ఓ వివాహితను తిరిగి వేధించిన నిందితుడికి రూ. 70వేల భారీ జరిమానా విధించినట్లు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట (Suryapet) పరిధిలోని పాలకీడు మండలం యల్లాపురం గ్రామానికి చెందిన షేక్ హకీం, అదే గ్రామానికి చెందిన మహిళను వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గతంలోనే అతనిపై కేసు నమోదైంది. అనంతరం నిందితుడి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తహసీల్దార్ ఎదుట సత్ప్రవర్తన గ్యారెంటీపై బైండోవర్ చేశారు.
అయితే బైండోవర్ చేసినప్పటికీ నిందితుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ సదరు వివాహిత పట్ల మళ్లీ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై మరోసారి కేసు నమోదు చేశారు. రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. నిందితుడు షేక్ హకీం బైండోవర్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లు ఎస్ఐ కోటేశ్ తహశీల్దార్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా నిందితుడికి రూ. 70వేల జరిమానా విధించారు. ఈ మేరకు నిందితుడి నుంచి ఆ జరిమానా మొత్తాన్ని వసూలు చేసి, ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

