Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజాపాలన పేరుతో రేవంత్‌ సర్కార్‌ మోసం: పుట్ట మధూకర్‌

కలం, కరీంనగర్ బ్యూరో: గత ప్రభుత్వాల హాయాంలో పనిచేసిన ముఖ్యమంత్రులు రైతులు, విద్య, వైద్యం వంటి ఏదో ఒక రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారని, కానీ ప్రస్తుత రేవంత్‌ సర్కార్‌ ప్రజాపాలన పేరుతో ఇళ్ల కూల్చివేతలకు ప్రాధాన్యం ఇస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. 8 ఇంక్లైన్ కాలనీలో సింగరేణి RG -2, కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారుల సమస్యల త్వరిత పరిష్కారం కోసం రిలే నిరహార దీక్ష చేస్తున్న అధికారులకు బీఆర్ఎస్ పార్టీ, TBGKS తరపున మద్దతు తెలిపారు.

అసంతృప్తిగా రేవంత్ పాలన..

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు దాదాపు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ఈ కాలంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలను అన్ని వర్గాల వారిని అసంతృప్తికి గురి చేసిందని విమర్శించారు. దేశానికి వెలుగులు అందించే సింగరేణి సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, తరతరాలుగా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనాలు, హక్కులు కల్పించడం లేదని విమర్శించారు. సింగరేణి కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో సమన్వయం లేకపోవడం వల్ల సింగరేణి సంస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని విమర్శించారు. సింగరేణికి సంబంధించిన మంత్రి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ, సంస్థ ఈ స్థితికి చేరడం దురదృష్టకరమని అన్నారు. ఒకవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు సింగరేణి కార్మికుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సింగరేణి సంస్థను బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తోన్న రేవంత్ సర్కార్..

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనబెట్టి విలాసవంతమైన ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్రగతి భవన్‌పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయాల నిర్మాణం పేరుతో భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, దివ్యాంగులు, వృద్ధులు, పేదల సంక్షేమానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. అలాగే సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకు నెరవేరలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, తమ పార్టీకి ప్రజలే రిమోట్ కంట్రోల్ అని పేర్కొన్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్‌లకు ఢిల్లీలో రిమోట్‌ కంట్రోల్‌ ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలు మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కార్మిక సంఘాలతో చర్చించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.

కేటీఆర్ వస్తే అడుగడుగునా అడ్డుకున్నారు..

ప్రజా ఉద్యమాలను అణచివేయాలనే ప్రయత్నాలు చేసినా ప్రజల మద్దతును ఆపలేరని అన్నారు. కన్నెపల్లి పంపుహౌజ్‌ సందర్శనకు బీఆర్‌ఎస రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్ వస్తే అడుగడుగునా అడ్డుకున్నారని, అయినా వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారని, ప్రజల్లో బీఆర్ఎస్‌కు ఉన్న ఆదరణకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. సింగరేణి అధికారుల సంఘం రోడ్డెక్కి నిరసన చేపట్టాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఇది ప్రభుత్వానికి అవమానమేనని ఆయన అన్నారు.

అధికారుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ఉద్యమం మరింత ఉధృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి అధికారుల సంఘం చేపట్టే న్యాయబద్ధమైన పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన ఆయన, అధికారులు ఎలాంటి కార్యాచరణ చేపట్టినా తమ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>